ప్రతి ఓటు ఎంతో కీలకం
బీఎల్‌ఏలు సమర్థవంతంగా పనిచేయాలి
ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్
ఉండవెల్లి, జూలై 26: ప్రతి ఓటు ఎంతో కీలకమని ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్‌ఏ లు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. మండల కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లతో సంపత్ కుమార్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై బిఎల్‌ఎల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బిఎల్ ఏల పాత్ర కీలకమన్నారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలు, బూత్ ఏజెంట్ల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అలంపూర్ నియోజకవర్గంలోని బిఎల్‌ఏలు చురుకుగా పనిచేస్తున్నప్పటికీ రోజువారి నివేదికలు సకాలంలో పంపడంలో ఆలస్యం అవుతుందన్నారు. అలాకాకుండా ప్రతిరోజు నివేదికలు పంపించాలని సూచించారు. ప్రతి బిఎల్‌ఓ తో ముఖాముఖి మాట్లాడి సర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీకాంత్, కోఆర్డినేటర్ శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, సర్పంచ్ నాగరాజు, వెంకటేష్ తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు, ఇన్చార్జీలు పాల్గొన్నారు.
బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్, జూలై 26: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం అలంపూర్ బీఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అలంపూర్ మండల స్థాయి బీఎల్‌ఏల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.






