27 July, 2026 | 2:16 AM

రెడ్డి x ఎస్సీ

27-07-2026 01:17 AM

తుంగతుర్తి వివాదం తారస్థాయికి

  1. కాంగ్రెస్‌లో ముదురుతున్న ఎమ్మెల్యేల వివాదం
  2. కనీస గౌరవం లభించడం లేదంటూ ఎస్సీ ఎమ్మెల్యేల ఆవేదన
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గోడు

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య, అగ్రకుల ఎమ్మెల్యేలకు, ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేల పొసగడం లేదు. నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గాల వివాదం తారా స్థాయి చేరింది. అది కాస్తా గాంధీభవన్‌కు కూడా చేరింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సీ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కతో ఎస్సీ సామాజిక వర్గానికి చెంది న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో వెలుగులోకి వచ్చిన అంశా లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇది పార్టీలో సామాజిక సమీకరణాలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. తమకు ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భట్టి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచా రం.

ఈ పరిణామం కాంగ్రెస్‌లో ‘రెడ్డి వర్సెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు’ అనే చర్చకు మరింత బలం చేకూరుస్తోంది. పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్సీ రిజర్డ్ నియో జకవర్గాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన విజయాలు కీలకంగా మారాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజాప్రతినిధు లకు కనీస గౌరవం కూడా దక్కడం లేదనే భావన బలపడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, మంత్రుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవీ తమకు సమాచారం ఇవ్వకుండా జరుగుతున్నాయని ఎస్సీ ప్రజాప్రతినిధులు భట్టి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే ఈ పరిస్థితి ఉంటే క్షేత్రస్థాయిలో తమ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

కేవలం అధికారుల వ్యవహార శైలిపైనే కాదు.. ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో కూడా తమకు తగిన ప్రాధాన్యత లేదనే అసంతృప్తిని వారు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రిజర్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల మాటను అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులను కలవాలన్నా అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.

భట్టి దృష్టికి అధికారుల అవినీతి!

ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న అవినీతిపైనా ఎస్సీ ప్రజాప్రతినిధులు భట్టి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, దీనిని ఇప్పటికైనా కట్టడి చేయకపోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర రాజకీయ నష్టం తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. అదే సమయంలో ఎస్సీ నియోజకవర్గాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరినట్లు సమాచారం.

ఎస్సీ ప్రజాప్రతినిధుల విన్నపాలను సావధానంగా విన్న భట్టి విక్రమార్క వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో ఐక్యత దెబ్బతినకుండా సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించినట్లు సమాచారం. అధికార యంత్రాంగంలో కొందరు వర్గాలకే ప్రాధాన్యత లభిస్తోందనే భావన ఎస్సీ ప్రజాప్రతినిధుల్లో బలపడుతుండగా, ఇది భవిష్యత్తులో పార్టీ అంతర్గత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తుంగతుర్తి కాంగ్రెస్‌లో కల్లోలం 

నల్లగొండ బ్యూరో (విజయక్రాంతి): తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామేల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు చర్చలు సాగుతున్నాయి. ఈ ఆధిపత్య పోరు కారణంగానే పార్టీ అధిష్ఠానం పార్టీ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని రాయబారిగా నియమించింది.

ఈయన ఇరు వర్గాలతో మాట్లాడి వివరాలు సేకరించి విభేదాలను అణిచివేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మందుల సామేలు తిరుమలగిరి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు చేశారు. నా నియోజకవర్గం మీద మీ పెత్తనం ఏంటని ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరి పాకానికి చేరింది. స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించానని, ఓటేసి గెలిపించిన వారు క్షమించాలని ప్రకటించడంతో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

నియోజకవర్గంలో పార్టీ కేడర్ రెండు గ్రూపులుగా చీలిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు నూతన అధ్యక్షులను నియమించడమే ప్రస్తుత వివాదానికి మూలకారణంగా నిలిచింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినప్పటికీ మూడు కీలక మండలాల్లో జరిగిన నియామకాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.