పెల్లెట్ గన్లకు ఆదేశాలెవరివి?
- పోలీసులతో పాటు కర్రలు పట్టినవాళ్లెవరు?
- బాధ్యులెవరో తేల్చాల్సిందే..
- విద్యార్థులపై బలప్రయోగం అమానుషం
- ఢిల్లీ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘాటు లేఖ
న్యూఢిల్లీ, జూలై 26 (విజయక్రాంతి): ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి, పెల్లెట్ గన్ల ప్రయోగం అమానుషమని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆదివారం ఆయన ఘాటైన లేఖ రాశారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్లు ప్రయోగించాలన్న ఆదేశాలు మీరే ఇచ్చారా? ఇవ్వకపోతే అను మతిచ్చింది ఎవరు? పోలీసులతో పాటు సాదా దుస్తుల్లో వచ్చి విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనే కీలక ప్రశ్నలు సంధించారు. ‘నీట్ ప్రశ్న పత్రం లీకేజీ, ఇతర విద్యా సమస్యలపై జూలై 20న విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
శాంతియుతంగా సాగుతున్న ఆందోళనను అణచివేయడానికి పోలీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే బలప్రయోగానికి దిగారు. లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించి భయానక పరిస్థితులు సృష్టించారు. ఈ ఘటనలో వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా మారింది. మహిళా విద్యార్థినుల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. మహిళలను ఈడ్చిపడేసి వారి ప్రైవేటు భాగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి’ దీనికి సమాధానం చెప్పాలని లేఖ ద్వారా రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనలో అత్యంత ఆందోళనకర అంశం విద్యార్థులపై పెల్లెట్ గన్లను ప్రయోగించడమేనని, ప్రాణాంతకమైన ఆయుధాలను విద్యార్థులపై వినియోగించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
ఈ కాల్పుల్లో ఓ జర్నలిస్టు కూడా గాయపడగా, 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్ కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని, బాధితుడిని స్వయంగా పరామర్శించానని, అతని వేదన చూసి చలించిపోయానని లేఖలో వెల్లడించారు. ఢిల్లీ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని రాహుల్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్లు ప్రయోగించాలన్న ఆదేశాలు ఇచ్చిందెవరు? సాదా దుస్తుల్లో కర్రలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా? అధికార పార్టీ వలంటీర్లా? చట్టబద్ధత లేకుండా వారిని రోడ్లపైకి పంపింది ఎవరు? అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాహుల్ హెచ్చరించారు.






