27 July, 2026 | 1:47 AM

బుల్లెట్ వేగంతో ప్రగతి

27-07-2026 12:56 AM
  1. తెలంగాణ అభివృద్ధికి హైస్పీడ్ రైళ్లు దోహదం
  2. రవాణా రంగంలో భారీ మార్పులకు నాంది 
  3. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు
  4. కొమురవెల్లి క్షేత్రంలో రూ.40 కోట్లతో రెండో ప్లాట్‌ఫాం
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
  6. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ప్రారంభించిన మంత్రి
  7. పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు

సిద్దిపేట,/కొమురవెల్లి /చేర్యాల, జూలై 26 (విజయక్రాంతి): బుల్లెట్ ట్రైన్లు రాష్ట్ర అభివృద్ధిలో గేమ్‌చేంజర్‌గా మారనున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లు మంజూరు కాగా, వాటిలో రెండు రైళ్లను కేం ద్రం తెలంగాణకే కేటాయించిందన్నారు. వీటి రాకతో భవిష్యత్తులో తెలంగాణ రూపురేఖల మారబోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన సిద్దిపేట కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.   హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు కేంద్రం రూ.500 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్రం త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్, ఇంజిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పరిశ్రమ అందుబాటులోకి వస్తే   వేలాదిమంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు.

కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్‌లో రూ.40 కోట్లతో రెండో ప్లాట్ ఫామ్ నిర్మిస్తామని,  మనోహరాబాద్ - రైల్వే లైన్ ను త్వరగా పూర్తి చేసి 2027లోగా వేములవాడ ఆలయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల సమయంలో  అదనపు రైళ్లు నడుపుతామని,  రైళ్ల సమయాలో మార్పులు చేస్తామని హామీ నిచ్చారు. 2047లోగా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని వెల్లడించారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ దిశగా పయనించడానికి మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అనంతరం డెమో రైల్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 

పదేళ్లలో రూ.36,286 కోట్లు : కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో రైల్వే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సవంత్సరానికి రూ.5,454 కోట్ల చొప్పున, గడిచిన పదేళ్లలో రూ.36,286 కోట్లు ఖర్చు చేసిందన్నారు. యూపీఏ హయాంలో ఏటా కేవలం రూ. 258 కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. 

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కొమురవెల్లి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం ఆవశ్యకమని తెలిపారు. గతంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వినతులను గుర్తించి ప్రాజెక్టును ముం దుకు తీసుకెళ్లినందుకు రైల్వేశాఖ మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. జనగా మ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి క్షేత్రం పేరుతో రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం నియోజకవర్గ ప్రజలకు, మల్లన్న భక్తులకు ఆనందదాయకమని, చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

ఈ రైల్వే స్టేషన్ ద్వారా గజ్వేల్, సిద్దిపేట, కొమురవెల్లి, సిరిసిల్ల ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాం లో ఎలాంటి అవాంతరాలు లేకుండా భూసేకరణను వేగంగా పూర్తి చేయడం వల్లే నేడు ఈ చారిత్రాత్మక ఘట్టం సాధ్యమైందని ఎమ్మె ల్యే గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, పింగళి శ్రీపాల్‌రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

స్థానిక సంస్కృతి, చరిత్ర ఆధారంగా రైల్వే లైన్లు

ప్రధాని మోదీ సహకారంతో జాతీ య రహదారులు, రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లు పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. స్థానిక సంస్కతి, చరిత్ర ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ఆయా జిల్లాల్లో  రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్  ముంబై, బెంగళూరు, హైదరాబాద్  అమరావతి వరకు వరకు నడిచే బుల్లెట్ రైళ్లు గేమ్ చేంజర్లుగా నిలవనున్నట్లు తెలిపారు.

అలాగే రాష్ర్టంలో ఐదు వందే భారత్, ఆరు అమృత్ రైళ్లను తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ వందేభారత్ రైళ్లను కూడా తయారు చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న సన్నిధికి కారులో వెళ్లాలంటే రూ.10,000 ఖర్చు అవుతుందని, ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్‌తో కేవలం 20 రూపాయల ఖర్చుతోనే భక్తులకు మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి గజ్వేల్‌లో దిగారు.