19 May, 2026 | 2:49 AM

పోలవరం సాగు భూముల్లో వాటా ఇవ్వాలి

19-05-2026 01:45 AM

రాజమహేంద్రవరంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

ఆదివాసీ నాయకుల డిమాండ్ 

రాజమహేంద్రవరం, మే 18: పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ఆదివాసులకు అమరావతి రైతుల మాదిరిగా ప్రాజెక్టు కమాండ్ ఏరియాలోని సాగుభూముల్లో వాటా కల్పించాలని మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివాసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కోసం భూములు, అడవులు, జీవనాధారాలు కోల్పోయిన ఆదివాసులను ప్రాజెక్టు ఆర్థిక ప్రయోజనాల్లో భాగస్వాములను చేయాలని కోరారు. సమావేశంలో 100 మందికి పైగా ఆదివాసీ నాయకులు, గ్రామ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదివాసీ సమన్వయ కమిటీ సలహాదారుగా, అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్తగా మాట్లాడిన డా. పూర్ణచంద్రరావు.. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనపై రాజ్యాంగ బాధ్యత కలిగిన గవర్నర్ కార్యాలయంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కోరారు. మహారాష్ట్రలో గిరిజన సంక్షేమంపై గవర్నర్ కార్యాలయం నేరుగా పర్యవేక్షణ చేస్తున్న విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అలాంటి వ్యవస్థ అవసరమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై జిల్లా కలెక్టర్లు నేరుగా గవర్నర్‌కు నివేదికలు పంపే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో సుమారు 90 శాతం మంది ఎస్టీలేనని, అయినప్పటికీ ప్రాజెక్టు దీర్ఘకాలిక ప్రయోజనాల నుంచి వారిని దూరం చేశారని విమర్శించారు. దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన ఆదివాసులు భూమిలేని పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిర్వాసిత ఆదివాసీ కుటుంబానికి జీవన భద్రత, సాగుభూమి హక్కు, కనీసం ఒక శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు ఆదివాసీ నాయకులు ఐదు ప్రధాన డిమాండ్లు ఉంచారు.

పోలవరం కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు సాగుభూమి ఇవ్వాలని, అమరావతి రైతులకు ఇచ్చినట్టే అభివృద్ధి ప్రయోజనాల్లో భాగస్వామ్యం కల్పించాలని, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పునరావాస కాలనీల్లో ఇళ్లతో పాటు సాగుభూమి, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సమన్వయ కమిటీ చైర్మన్ చందా లింగయ్య దొర మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల 355కు పైగా ఆదివాసీ గ్రామాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. 45.75 మీటర్ల పూర్తి జలాశయ మట్టం కారణంగా వందలాది గ్రామాలు, పోడు భూములు, అటవీ నివాసాలు ముంపు ముప్పును ఎదు ర్కొంటున్నాయని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే లేక రాజారావు మాట్లాడుతూ.. పునరావాసం, పరిహారం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల మౌలిక వసతుల విషయంలో తీవ్ర లోపాలున్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. భూమికి భూమి ఇవ్వాల్సిన విధానాన్ని అమలు చేయకుండా కేవలం నగదు పరిహారంతో సరిపెట్టారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ నాయకులు చందా లింగయ్య దొర, లేక రాజారావు, కె. లక్ష్మణమూర్తి,  గరిడె బాబు రావు , బంగారు బాబు బి. పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.