మాట ఇచ్చాడు.. నీళ్లు తెచ్చాడు
- చెంగిచెర్ల 12వ డివిజన్‌లో తాగునీటి కోసం
- బోరును ప్రారంభించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): చెంగిచెర్ల 12వ డివిజన్ ప్రజలు చాలా కాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెంగిచెర్లలో పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు తమ నీటి కష్టాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బోర్లు లేకపోవడంతో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి, రోజువారీ జీవనం కష్టంగా మారిందని ప్రజలు వివరించారు.
మల్లన్న వెంటనే స్పందించి చెంగిచెర్ల 12వ డివిజన్ టీఆర్పీ నాయకులు మహేష్‌కు తక్షణమే బోర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మల్లన్న ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకున్న మహేష్ స్వల్ప కాలంలోనే (4 రోజుల్లోనే)బోర్ ఏర్పాటు పనులను పూర్తి చేయించారు.
సోమవారం ఆ బోరును ఎమ్మెల్సీ తీన్మార్ సమక్షంలో ప్రారంభించారు. తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వేగంగా స్పందించి పనులు పూర్తి చేసిన టీఆర్పీ నాయకుడు మహేష్‌ను అభినందించారు.






