19 May, 2026 | 2:48 AM

పర్యాటక కేంద్రంగా ముత్తంగి ఎంక చెరువు!

19-05-2026 01:44 AM
  1. రూ.7.60 కోట్లతో చెరువు సుందరీకరణ
  2. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

పటాన్చెరు, మే 18 : ముత్తంగి డివిజన్ పరిధిలోని ఎంక చెరువును రూ.7 కోట్ల 60 లక్షల నిధులతో సుందరీకరణ చేస్తున్నామని.. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం హెచ్‌ఎండిఏ అధికారులు, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. స్వయంగా చెరువు కట్టపై ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పనుల పురోగతిని తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గల ఎంక చెరువును పర్యటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హెచ్‌ఎండిఎ ద్వారా రూ.7 కోట్ల 60 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా కట్ట అభివృద్ధితోపాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైటింగ్, గార్డెనింగ్, తదితర పనులు చేపట్టడం  జరుగుతుందని తెలిపారు. చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 80 శాతం పనులు పూర్తయ్యాయని.. మరో రెండు నెలల్ల పనులు పూర్తిచేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు.

ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువు కట్ట పైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. ముత్తంగితోపాటు ఇస్నాపూర్, పాశమైలారం, చిట్కుల్, లకడారం గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన చెరువు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పటాన్చెరులోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, దోషం చెరువులను సైతం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ డిఈ  రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కుమార్ గౌడ్, ప్రభాకర్, కిట్టు, శ్రీనివాస్ రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, అబేద్, రవి, తదితరులు పాల్గొన్నారు.