సంగీత వాణి... ఈ ‘రాణి’...
బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్రాంత ఉద్యోగి...
కీ బోర్డు వాయించడంలో సాధించిన పట్టు..
గిన్నిస్ వరల్ రికార్డులో దక్కిన చోటు
ఆదిలాబాద్, జూలై 5 (విజయక్రాంతి): కళలకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు ఆదిలాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి టీ.ఈ.వీ రాణి. వృత్తి ప్రభుత్వ ఉద్యోగి... ప్రవృత్తి సంగీతం ప్రపంచం... వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే తనకు నచ్చిన సంగీత సాహిత్య రంగంలో పట్టు సాధించారు.
తాను అందరిలా కాకుండా ఏదైనా సాధించాలన్న తపన ఆమెలో నెలకొంది. ఆ ఆలోచనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే భీజం పడింది. అనుకున్నట్లే అరుదైన ఘనతను సాధించి, అందరి మన్ననలను పొందింది. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏమిటి, ఆ ఘనత సాధించిన ఆ మహిళ ఎవరు తెలియాలంటే ఈ స్టోరీ చదలాల్సిందే.. గిన్నిస్ వరల్ రికార్డులో స్థానం దక్కించుకున్న ఆదిలాబాద్ కు చెందిన టీ.ఈ.వీ రాణి ఇటీవలే పదవీ విరమణ పొందారు.
మహిళ శిశు సంక్షేమ శాఖ లో 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసి ఇటీవలే సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయ్యారు. గతంలో ఉద్యోగం చేస్తూనే వ్యాఖ్యాతగా, గాయనిగా, కవయిత్రిగా, రంగస్థల నటిగా, సంగీత వాయిద్య కారిణిగా, నృత్య కళాకారిణిగా, క్రీడా కారిణిగా ఇలా విభిన్న కళా రంగాల్లో రాణించారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగ విరమణ తర్వాత శేష జీవితాన్ని సంగీత సాహిత్య రంగంలో గడుపుతూ సెకండ్ ఇన్నింగ్ లో ప్రతిభ కనబరుస్తున్నారు. తాజాగా కీ-బోర్డు వాయించి గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరును లిఖించుకున్నారు.
గిన్నిస్ వరల్ద్ రికారడ్స్ ప్రతినిధులు గత ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయ స్థాయి ఎలక్ట్రానిక్ కీ బోర్డు వాయిద్య పోటీలను నిర్వహించారు. ఈ పోటిలకు హైదరాబాద్ వేదికైంది. దాదాపు 22 దేశాల నుండి వచ్చిన రెండు వేల మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఒక గంట పాటు ఏకధాటిగా కీ బోర్డును వాయించారు.
అందులో 777 మంది ప్రతిభ కనబరిచి గిన్నిబు క్ ఆఫ్ వరల్ రికార్డ్ లో చోటు సంపాదించారు. అందులో ఒకరు ఆదిలాబాద్ కు చెందిన టీ.ఈ.వీ రాణి ఒకరు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ను టీ.ఈ.వీ రాణి ప్రతినిధుల చేతుల మీదుగా అందుకున్నారు. గిన్నిస్ రికార్డు సాధించిన టీ.ఈ.వీ రాణి ని పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.






