నాణ్యమైన ధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం /కూసుమంచి, మే -13(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రానికి వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. పాలేరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి లతో కలిసి కోనుగోలు ప్రక్రియ, కేంద్రాల్లో రైతులకు అందిస్తోన్న మౌళిక వసతులను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. టోకెన్ విధానం అమలులో ఉందా అనే అంశాన్ని పర్యవేక్షిస్తూ, నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని, టోకెన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారా, గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కట్టుదిట్టంగా నిర్వహించాలని, ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలు, వారు తీసుకువచ్చిన వడ్ల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, వడ్ల తేమశాతం ఎప్పటి కప్పుడు రికార్డ్ చేసి కొను గోలు చేయాలని అన్నారు. మద్దతు ధరపై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల దృష్ట్యా పంట నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇచ్చార్జ్ మేనేజర్ సునీల్ రెడ్డి, డిఆర్డీవో శ్రీరాం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, కూసుమంచి తహసీల్దారు సైదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






