14 May, 2026 | 3:54 AM

విద్యాభివృద్ధిలో అందరు భాగస్వాములవ్వాలి

14-05-2026 02:46 AM

అలంపూర్ మే 13: ప్రజా ప్రతినిధులు అందరు విద్యాభివృద్ధిలో కీలక పాత్ర వహించి విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు భాగస్వాములవ్వాలని ఆయా మండలాల విద్యాధికారులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి కళాశాలలో అలంపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ... గ్రామాల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, సమాజ భాగస్వామ్యం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రజా ప్రతినిధులు గ్రామస్థాయిలో విద్యాభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ప్రతి గ్రామాన్ని విద్యా ప్రగతిలో ఆదర్శంగా నిలపాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో సర్పంచులు ,మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంఈఓ లు శివప్రసాద్, అశోక్ కుమార్, నరసింహ ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు