ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి
నిర్మల్ మే 13 ( విజయ క్రాంతి): మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన ధాన్యం గోదాములకు తరలింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతo చేయాలనీ ఆదేశించారు.
ఇప్పటికే టోల్ ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నామని తెలిపారు. అవసరానికి అనుగుణంగా మరిన్ని లారీలు సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు సమకూర్చే ప్రాంతాలు, అన్లోడింగ్ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ తదితర శాఖల సిబ్బందిని షిఫ్ట్ల వారీగా నియమించాలని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం సంచులు నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు.
అవసరమైతే స్థానిక కూలీలను హమాలీలుగా నియమించుకోవాలని తెలిపారు. 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో అన్లోడింగ్ పాయింట్లు ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ గోదాములతో పాటు ప్రైవేట్ గోదాములు, రైతు వేదికలు తదితర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వరి, మొక్కజొన్న ధాన్యం తరలింపు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేందుకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చెక్పోస్టులు, టోల్ప్లాజాలు, ఇతర తనిఖీ కేంద్రాల్లో తగిన పోలీసు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. రైతుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డీఎస్పీ శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారులు, మేనేజర్లు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్ఫెడ్ మహేష్, డీఆర్డీఓ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






