ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 13 (విజయ క్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసిల్దార్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు సేకరించాలని సూచించారు. మరణించిన లేదా గ్రామం విడిచివెళ్లిన ఓటర్లను గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించాలని తెలిపారు. సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలని, రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను అందించి సహకరించాలని కోరారు.
అనంతరం ధాన్యం కొనుగోలు, గోనె సంచుల లభ్యత, మొక్కజొన్న కొనుగోలు, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ధ్రువపత్రాల జారీ తదితర అంశాలపై తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల ప్రవేశాల పెంపు, డ్రాప్‌అవుట్ల తగ్గింపు కోసం సర్పంచులు, కౌన్సిలర్లు కృషి చేయాలని సూచించారు. ప్రతి నెల పాఠశాలలను సందర్శించడం, పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొనడం, పరిశుభ్రత, ఉపాధ్యాయుల సమయపాలన, నాణ్యమైన బోధనపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి లలిత, మున్సిపల్ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్, పీఏసీఎస్ అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ , అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ‘అలింకో’ సహకరించడం అభినందనీయం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 13 (విజయ క్రాంతి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ ఉపకరణాలు అందించడంలో అలింకో సంస్థ సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనకాపూర్ భవిత కేంద్రం సందర్శన సమయంలో తల్లిదండ్రులు ఉపకరణాల అవసరాన్ని తన దృష్టికి తీసుకురావడంతో అలింకో సంస్థను సంప్రదించామని తెలిపారు. దాదాపు రూ.22 లక్షల వ్యయంతో 184 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, బ్రెయిలీ ప్లేట్లు, కృత్రిమ అవయవాలు తదితర ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
దివ్యాంగ పిల్లలపై జాలి చూపించడం కాకుండా వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలని, సమాజంలో అందరిలా జీవించేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో లలిత, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి
జనగణన 2027 లో భాగంగా చేపట్టిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు వివరాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
కేటాయించిన ఇండ్ల జాబితా బ్లాక్ లలో ప్రతి ఇంటిని సందర్శించాలని, ఆయా కుటుంబ సభ్యుల నుండి పొందుపరిచిన 32 ప్రశ్నలకు వివరాలు సేకరించి స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలోని ఇండ్ల యజమానులు ఎన్యూమరేటర్లకు సహకరించి పారదర్శకంగా వివరాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






