డ్రగ్స్ నిర్మూలిత నగరమే లక్ష్యం
గాంధీ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన సీపీ సజ్జనార్
సికింద్రాబాద్, ఏప్రిల్17(విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని మాదకద్రవ్యాల నుంచి పూర్తిగా విముక్తి కలిగించడమే లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లతో సీపీ నేరుగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
వ్యసనం నుంచి బయటపడేందుకు వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం వైద్యులతో సమావేశమై చికిత్స విధానాలు, కౌన్సెలింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై నిశిత నిఘా ఉంచామని తెలిపారు. నగరంలో డ్రగ్స్ నియంత్రణలో హెచ్-న్యూ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి, సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ సురేష్, డీసీపీలు రక్షితా కృష్ణామూర్తి, వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అదనపు డీసీపీ అందే శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.






