31 July, 2026 | 2:06 AM

20 వేల పోస్టులు భర్తీ చేయాలి

31-07-2026 12:22 AM
  1. ఏడు వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ సరికాదు
  2. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల ఆందోళన
  3. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా  

ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏడు వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి చిక్కడపల్లిలోని సిటీ సెంటర్ లైబ్రరీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 20వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులను చేత బూని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేష్, కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 19 వేల పోలీసు ఖాళీలున్నప్పటికీ కేవలం ఏడు వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. వయోపరిమితిని కానిస్టేబుల్ పోస్టులకు 36, ఎస్‌ఐ పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని, ఫిజికల్ ఈవెంట్‌లో నాలుగు మీటర్ల లాంగ్ జంప్‌ను 3.8 మీటర్లకు తగ్గించాలని, అదనపు నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.

అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ, గ్రూప్స్, జేఎల్‌ఎం, బీట్ ఆఫీసర్ తదితర నోటిఫికేషన్లను కూడా వెంటనే విడుదల చేయాలని కోరా రు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాల కోటి, రవి యాదవ్, సవాయ్ సింగ్, సురేష్, గణేష్, శ్రీనివాస్, నరసింహ, కుమార్, శ్రీకాంత్, జయశ్రీ, కల్పన, బిందు తదితరులు పాల్గొన్నారు.