హుస్నాబాద్‌లో ఔట్ పోస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
ఏసీపీ ఆఫీస్ లో రికార్డ్ ల తనిఖీ
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
హుస్నాబాద్, జూలై 30: హుస్నాబాద్ పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అవసరమైందన్నారు. ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఆధునిక పరికరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని, ప్రతి గ్రామాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరింత సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు.
అనంతరం నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ అధికారులతో కలిసి మొక్కలును నాటారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన జాన్ విల్సన్ కాంస్య విగ్రహాన్ని పరిశీలించి, పేలుడు ఘటనలో ఆయన మృతి చెందిన పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ ఆఫీస్ లో రికార్డ్ లు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం, సీఐ శ్రీధర్, హుస్నాబాద్ ఎస్త్స్ర పాకాల లక్ష్మారెడ్డి, అక్కన్నపేట ఎస్త్స్ర చాతరాజు ప్రశాంత్, కోహెడ ఎస్త్స్ర పుల్ల అభిలాష్, కొమురవెల్లి ఎస్త్స్ర తోట మహేష్, హుస్నాబాద్ ట్రాఫిక్ ఎస్త్స్ర వెంకటేశ్వర్ రెడ్డి, ఏఎస్త్స్ర రాంప్రసాద్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






