31 July, 2026 | 3:07 AM

వనదుర్గా ప్రాజెక్టును పరిశీలించిన మెదక్ ఎస్పీ

31-07-2026 12:23 AM

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలి 

నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు, వీడియోల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు 

పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలి

పాపన్నపేట,జులై30: మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాయల ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టును మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆనకట్ట పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు, వీడియోల కోసం వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని ప్రజలకు హెచ్చరించారు. వరద నీటిలోకి దిగడం, ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆనకట్ట దిగువ ప్రాంతాల్లో పశువులను మేపే కాపరులు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహ ప్రాంతాల వైపు పశువులను తీసుకెళ్లవద్దని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.