అయిజలో నకిలీ విత్తనాల జోరు!
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
అయిజ, జూలై 30: అయిజ పట్టణంలో గ్యారెంటీ, నాణ్యమైన విత్తనాలంటూ విక్రయించి, పంట చేతికొచ్చే సమయానికి నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిజ మండలం పర్తిపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప గౌడ్ రెండు ఎకరాలకు సరిపడా వేరుశనగ విత్తనాలను స్థానికంగా కొనుగోలు చేసి సాగు చేశాడు. పంట కాలం ము గుస్తున్నా కాయలు సరిగా కాయకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన రైతు, విత్తనాల సంచులతో సంబంధిత దుకాణం ఎదుట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు.
తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు. విత్తనాల నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాలను తనిఖీ చేసి, విత్తనాల నాణ్యత, బిల్లులు, లైసెన్సులు, నిల్వలపై పర్యవేక్షణ పెంచాలని రైతులు కోరుతున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. రైతులు ఫిర్యాదుపూర్వకంగా ఇస్తే చర్యలు తీసుకుంటాం... వ్యవసాయ అధికారి జనార్ధన్ రైతులు ఎక్కడపడితే అక్కడ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర విత్తన కొనుగోలు చేయడం వల్ల మా దృష్టికి రాకుండానే పోతుంది. ఒకవేళ నష్టపోయిన రైతులు ఫిర్యాదుపూర్వకంగా వస్తే అట్టి షాపు యజమానులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.






