వ్యాయామం రోజువారీ దినచర్యగా అలవర్చుకోవాలి
ఉత్సాహంగా 5కే రన్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): వ్యాయామాన్ని నిత్య జీవన చర్యలో ఒక భాగంగా అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ’5K రన్’ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తో కలిసి ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.
పట్టణ పురవీధుల్లో ఉత్సాహ భరితంగా సాగిన 5K రన్ లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. విజేతలుగా నిలిచిన వారికి అతిథులు నగదుతో పాటు ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు.
నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యకరమైన జీవనం సాగించడం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామాలను తమ నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతరం శారీరక శ్రమ చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని, దీనివల్ల యువత సులభంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ మానసిక, శారీరక ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేకంగా పాటుపడాలని కోరారు.
ఇదే సమయంలో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ తరఫున తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా క్రీడలు, శారీరక శ్రమ వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డివైఎస్‌ఓ శ్రీనివాస్, ఎఫ్డీఓ అరవింద్, ఎఫ్‌ఆర్‌ఓలు రాథోడ్ అవినాష్, శీలానంద్, శ్రీనివాస్, అనిత, అటవీ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు, యువత, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






