11 April, 2026 | 3:57 AM

అప్పుడు జీవో ఇచ్చి.. ఇప్పుడు అడ్డుకుంటారా?

11-04-2026 12:00 AM
  1. గొల్లపల్లి రిజర్వాయర్‌కు జీవో ఇచ్చింది గత సర్కారే
  2. కాసుల కోసమే మీరు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టారా?
  3. పదేళ్లలో పాలమూరులో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
  4. పాలమూరు ప్రాజెక్టులపై హరీశ్‌రావు చర్చకు రావాలి 
  5. మంత్రి జూపల్లి సవాల్ 

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ద్వంద్వనీ తిని అవలంబిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జీవోలు ఇచ్చిందని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుతగలడం సిగ్గుచేటని విమర్శించారు.

శుక్రవారం సీఎల్పీ కార్యా లయంలో ఎమ్మెల్యేలు జీ మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2016లో 25 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.4,177 కోట్లతో జీవో ఇచ్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. 2019 మార్చిలో గొల్లపల్లితో సహా 27 రిజర్వాయర్లను ప్రతిపాదించి, ఇప్పుడు అదే ప్రాజెక్టు నిర్మించొద్దని మాట్లాడటం పాలమూరు ప్రజలను వంచించడం కాదా? అని నిలదీశారు.

కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీళ్లు ఉభయ రాష్ట్రాలకు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు,  తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేసి తీవ్ర అన్యాయంచేశారని, శ్రీశైలంలో నీళ్లు లేని సమయం లో వాడుకోవడానికి రిజర్వాయర్లు అవసరమని గతంలో తాము మొత్తుకున్నా పట్టించు కోలేదని ధ్వజమెత్తారు. పాలమూరు- ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యా యని హరీశ్‌రావు చెప్తున్న మాటల్లో ఏమా త్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు.

రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తిచేస్తారని నిలదీశారు. కనీసం కాలువల నిర్మాణం పూర్తిచేయ లేదని, భూసేకరణ చేయలేదని, పరిపాలనా అనుమతులు లేవని వివరించారు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారు తప్ప, ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరుపై రూ.7 వేల కోట్లు ఖర్చుచేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ.8,300 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. 50 టీఎంసీల మల్లన్నసాగర్ కోసం రైతులను ఈడ్చి పారేసి ప్రాజెక్టు కట్టిన హరీశ్‌రావుకు పాలమూరు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, దోచుకోవడానికే గత ప్రభుత్వం ప్రాజెక్టులను వాడుకుందని, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ చేపట్టిన కల్వకుర్తి ప్యాకేజీ 29 పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు.