15 July, 2026 | 12:26 AM

భాష్యం స్కూల్‌లో ఘనంగా ఫ్రెషర్స్ డే

15-07-2026 12:26 AM

ఏఎస్ రావు నగర్, జూలై 14 (విజయక్రాంతి): డాక్టర్ ఏఎస్ రావు నగర్ లోని భాష్యం హై స్కూల్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, వారి విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జెడ్ ఈవో ఎస్ మార్కండేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జెడ్‌ఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, విలువలతో కూడిన విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు. ప్రిన్సిపాల్ కే అమరేశ్వర రావు మాట్లాడు తూ.. భాష్యం విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, ఉత్తమ బోధనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయనీ అన్నారు. భాష్యం లిటిల్ చాంప్స్ హెడ్మిస్ట్రేట్ పీ వనిత మేరీ నూతన వి ద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాఠశాలలో ఆనందంగా విద్య నేర్చుకుంటూ ప్రతిభను చాటుకోవాలనీ సూచించారు. 

ఈసీఐఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ స్వాతి మాట్లాడుతూ.. భాష్యం విద్యా సంస్థలు అహర్నిశలు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గత సంవత్సరం పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.