సంచార జాతులను గుర్తించరా?
డా. తిరునహరి శేషు :
సమాజంలో ఒక జాతి కాని, ఒక వర్గం కాని తన అస్తిత్వాన్ని, గుర్తింపుని కాపాడుకోలేకపోతే ఆ జాతి మనుగడ సాగించలేదు. ఒకనాడు నిమ్న జాతులు ఎంత అణచివేతకి, నిరాదరణకి గురయ్యాయో నేటికీ వెనుకబడిన తరగతులలోని అల్పసంఖ్యాకులు కూ డా అదే వివక్షను, నిరాదరణను ఎదుర్కొంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి న ఈ 79 సంవత్సరాలలో సామాజిక వెనుకబాటుతనం, రాజకీయంగా బలమైన వర్గంగా ఎదగకపోవడం వలన బలహీనవర్గాలలోని అల్పసంఖ్యాక జాతులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలబడిపోయినాయి.
బలహీనవర్గాలలోని అల్పసంఖ్యాక జాతులైన విముక్త జాతు లు, సంచార జాతులు, అర్ధసంచార జాతులు తమ గుర్తింపు, సంక్షేమం, అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పోరాడుతు న్నా ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో ఈ వర్గాల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇతర వెనుకబడిన తరగతుల లోని (ఓబీసీ) ఉపకులాల మధ్య ఉన్న అసమానతలను అధ్యయనం చేయటానికి 2017లో కేంద్ర ప్రభుత్వం నియ మించిన జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 2600 ఓబీసీ కులాలలో 25 శాతం కులాలే (650 కులాలు) 97 శాతం అవకాశాలు దక్కించుకున్నాయి.
అలాగే 984 కులాలకి (38 శాతం) విద్యా, ఉద్యోగాలలో ఎలాంటి అవకాశాలు దక్కలేదు. మరో 983 కులాలకి 2.4 శాతం అవకాశాలు మాత్రమే దక్కాయి. మొత్తం ఓబీసీ కులాలలో 75 శాతం కులాలకి 3 శాతం అవకాశాలు మాత్రమే దక్కాయి. అంటే ఓబీసీలలోని అల్పసంఖ్యాక జాతులకి అన్యాయం జరిగిందనే విషయం స్పష్టమవుతుంది.
తెలంగాణలో కూడా 134 బీసీ కులాలలో 100కి పైగా ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకి, సంచార జాతులకి నిధుల కేటాయింపులో, సంక్షే మ పథకాల అమలులో, అధికారిక పదవుల కేటాయింపులో సరైన వాటా అవ కాశాలు దక్కలేదనే విషయాన్ని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పట్టించుకోని ప్రభుత్వాలు
ఓబీసీల వర్గీకరణ దేశవ్యాప్తంగా ఒకే విధంగా లేకపోవడం వలన నిధులు, రిజర్వేషన్ల కేటాయింపులో, పథకాల అమలులో అనేక రకాలైన సమస్యలు తలెత్తుతున్నాయి. తమిళనాడులో ఎంబీసీలకి, డీఎన్‌టీలకి, బీహార్‌లో ఈబీసీ (ఎక్స్‌ట్రీమ్ బ్యాక్‌వర్డ్ క్లాస్)లకి ప్రాధా న్యం దక్కుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాలలో బలహీనవర్గాల వర్గీకరణలో లో పాలు ఉండటంతో బీసీలలోని అల్పసంఖ్యాకులైన ఎంబీసీలకు, డీఎన్‌టీలకు, సంచారజాతులకు, అర్ధసంచార జాతులకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి బలహీనవర్గాలను బీసీలుగా, ఎంబీసీలుగా, సంచార జాతులుగా పునర్వ్యవస్థీ కరించి న్యాయం చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
2017లో నాటి కేసీఆర్ ప్రభుత్వం బలహీనవర్గాలలో అత్యంత వెనుకబడి న వర్గాలను (ఎంబీసీ) గుర్తించటానికి ప్రయత్నం చేసినప్పటికీ, అనేక అభ్యంతరాల నడుమ ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. డినోటిఫైడ్, సంచార, అర్ధసంచార జాతులకి విద్యా, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, గృహ వసతి లాంటి విషయాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2022 లో సీడ్ (స్కీమ్ ఫర్ ఎకనామికల్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డీఎన్‌టీ) అనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయితే తెలంగాణలో బలహీనవర్గాలలో డీఎన్‌టీ, ఎన్‌టీ, ఎస్‌ఎన్‌టీ లాంటి వర్గీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రం నుంచి సీడ్ పథకం ద్వారా బలహీనవర్గాలు లబ్ధి పొందలేకపోతున్నాయి. కాబట్టి కేంద్ర డీఎన్‌టీ బోర్డ్ ఆదేశాలు, తెలంగాణ బీసీ కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 10ని విడుదల చేసింది. బీసీ--ఏలోని 49 కులాలు, బీసీ-ఈలోని 2 కులాలను మొత్తం 51 కులాలను డీఎన్‌టీ, సంచార జాతులు, అర్ధసంచార జాతులుగా గుర్తించారు.
ఆర్డీవో ద్వారా సంచార జాతులుగా గుర్తింపు పొందిన వారికి సీడ్ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. సంచార జాతులుగా గుర్తింపు పొందిన 51 కులాలలో వడ్డెర, పూసల, దాసరి, వంశరాజ్, మేదరి, వాల్మీకి బోయ, గంగిరెద్దుల లాంటి ఏడు కులాలు మాత్రమే కొద్దిగా గుర్తింపు పొంది, ఉనికిలో ఉన్నవి.
కానీ, మిగతా 44 కులాలు మనకు ఎక్కడా కనపడవు. వారి గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు కూడా లేవనే చెప్పాలి. ఈ కులాలను ఆదుకొని, వారి సాధికారత కోసం పనిచేయాలని ఏ ప్రభుత్వాలు భావించలేదు. ఈ కులాల చరిత్రలో జీవో నెంబర్ 10 మొదటి అడుగుగానే భావించాలి. ప్రభుత్వాలు కూడా ఈ కులాల గుర్తింపుతోనే ఆగిపోకుండా వారి సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపడితే వారికి కూడా దేశాభివృద్ధి ఫలాలు దక్కే అవకాశం ఉంటుంది.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి?
సంచార జాతులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 10 ద్వారా రాష్ట్రంలో 51 కులాలకు చెందిన 19 లక్షల సంచారజాతుల వారికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీడ్ పథకంలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంచార జాతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలతో పాటు కార్పొరేషన్ కూడా ఏర్పా టు చేయాలనే డిమాండ్ ఆయా వర్గాల నుంచి వస్తున్నది.
2017లో తెలంగాణ ప్రభుత్వం బీసీలలో అత్యంత వెనుకబడిన కులాల కోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం బలహీనవర్గాలలో ఎవరు అత్యంత వెనుకబడిన వర్గాలు అనే జాబితాని తయారు చేయకపోవడంతో ప్ర యోజనం లేకుండాపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 బీసీ కులాలకి ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. తెలంగాణలో బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
ఈ రెండు కార్పొరేషన్లతో పాటు 18 కుల ఫెడరేషన్లకి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు. కానీ, వాటిని ఖర్చు చేయడం లేదు. అలాగే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్న కొద్దిపాటి నిధులలో కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 51 సంచార జాతులకి ఒక్క రూపాయి అందటం లేదు.
ప్రభుత్వం సంచార జాతులుగా ఎంపిక చేసిన వడ్డెర, బట్రాజ్, వాల్మీకి బోయ, మేదర్ లాంటి నాలుగు కులాలకే ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. కాబట్టి సంచార జాతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సంచార జాతుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించాలి.
సంచార జాతుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ప్రజా వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి సంచారజాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ప్రభుత్వమే సంచార జాతులను గుర్తించింది, కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటులో ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది.
2012లో 100 మంది బీసీలను శాసనసభలో కూర్చోబెడదామని ఒక రాజకీయ పార్టీ నిర్ణయానికి బలమైన మద్దతుదారుగా నిలబడిన వేం నరేందర్ రెడ్డి సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటుకి ప్రభుత్వాన్ని ఒప్పిస్తారనే విశ్వాసం ఉంది. తెలంగాణలో అగ్రవర్ణ పేదల సంక్షేమానికి బ్రాహ్మణ, కమ్మ, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు సమాజంలో గుర్తింపుకే నోచుకోని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోతే ప్రజా పాలనకి అర్థమేమి ఉంటుందనే ప్రశ్నకి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
వ్యాసకర్త: 9885465877






