21 June, 2026 | 2:42 AM

వృద్ధులపై అకృత్యాలు!

21-06-2026 12:00 AM

దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై నేరాలు ఏటా క్రమంగా పెరుగుతున్నాయి. శారీరక ఆరోగ్య సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ నిర్లక్ష్యం, మోసాలు, దాడులు వంటి అనేక సవాళ్లతో సహవాసం చేస్తున్న వృద్ధులు దొంగతనాలు, ఆస్తుల ఆక్రమణలు, మోసాలు, నమ్మకద్రోహం వంటి నేరాలను ఎదుర్కోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలు సీనియర్ సిటిజన్ల పరిస్థితిని తెలియజేస్తున్నాయి.

ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2024లో ఈ తరహా కేసులు 31 వేలకు పైగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కేసులు 17 శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ముఖ్యంగా ఒంటరిగా నివసించే వృద్ధులు నేరస్థులకు లక్ష్యంగా మారుతున్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. మరోవైపు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ఇంకో ప్రధాన సమస్యగా మారింది.

ఉద్యోగ విరమణ అనంతరం చాలామంది తమ పొదుపులు లేదా పింఛన్లపైనే ఆధారపడుతున్నారు. అయితే, జీవన వ్యయాలు పెరగడం, వైద్య ఖర్చులు అధికమవడం వల్ల ఆ ఆదాయం చాలక కొందరు తమ పిల్లలపై ఆధారపడుతుండగా, మరికొందరు అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే మోసానికి పాల్పడుతుండటం, వారి పొదుపులను దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

ఇటీవలి కాలంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. తప్పుడు పెట్టుబడి పథకాలు, బహుమతులు వస్తాయని చెప్పే మోసాలు, బ్యాంకు వివరాలు సేకరించి డబ్బు దోచుకునే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఈ మోసాలకు బలై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆర్థిక సమస్యల కంటే మానసిక ఒంటరితనం వారిని మరింతగా కుంగదీస్తున్నది.

కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు తగ్గిపోవడం, తమ అభిప్రాయాలకు విలువ లేకపోవడం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం, సమాజం, కుటుంబాలు కలిసి కృషిచేయాలి. వృద్ధులకు అవసరమైన గౌరవం, ప్రేమ, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. జీవితమంతా కుటుంబం, సమాజం కోసం శ్రమించిన పెద్దలకు భద్రత, గౌరవం కల్పించడం మనందరి సామాజిక బాధ్యత.