అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం..
ఇప్పటివరకు మాస్, యాక్షన్ పాత్రలతో అలరించిన రవితేజ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన భావోద్వేగ పాత్రలో అలరించేందుకు ‘ఇరుముడి’తో వస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమా ర్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేశ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా రెండో పాట ‘యాలాలో యాలాలో’ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో రవితేజ ఆటో డ్రైవర్‌గా కనిపించారు. మద్యానికి బానిసైనప్పటికీ కుటుంబం కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటోంది. ప్రియా భవా ని శంకర్ కుటుంబ
బాధ్యతలను భుజాన వేసుకునే భార్య పాత్రలో మెప్పించగా, బేబీ నక్షత్ర తండ్రితో విడదీయలేని అనుబంధం ఉన్న కూతురిగా కనిపించింది. ‘యాలాలో యాలాలో.. వెన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో.. దోపిట్లో ఎన్నెన్ని లోగుట్టులో.. అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం, చూడాలి ఈ లోకం.. కొండతో చుట్టరికం.. కోనతో ఇల్లరికం.. లేదు ఏ పేదరికం, మాతోనే మా లోకం.. యాల యాలో ఏముంది మేడల్లో.. యాలో ఏముంది కాసుల్లో.. యాలో ప్రేముంది గుండెల్లో..’ అంటూ సాగుతోందీ గీతం.
జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, హేషమ్ అబ్దుల్ వహాబ్, సాధికా కేఆర్ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటర్: ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.






