4 August, 2026 | 2:33 AM

నాని సమర్పణలో నితిన్ సినిమా

04-08-2026 12:44 AM

నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్ష న్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించా రు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఈ చిత్రానికి జోమన్ టీ జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలావుంటే, ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్టును చిత్రబృందానికి అందజేశారు.

‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీశ్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభం నుంచే, నేను సక్సెస్ కాకముందే నితిన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘జయం’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ. మంచి కథ, అద్భుతమైన టెక్నీషియన్స్‌తో కలిసొస్తే అలాంటి ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమా చేయబోతున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం” అని తెలిపారు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. ఇంత మంచి కథతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మా అందరినీ గర్వపడేలా చేస్తుందని నమ్ముతున్నా” అని చెప్పారు. దర్శకుడు మురళీకాం త్ దేవసోత్ మాట్లాడుతూ.. “ఈ కథకు నాని ఓకే చేసినప్పట్నుంచి అన్నీ చాలా అందంగా జరుగుతున్నాయి. నితిన్ ఈ సినిమాలో భాగం కావడం నా కల నిజమైనట్టే. అదే సమయంలో బాధ్యత కూడా మరింత పెరిగింది” అన్నారు.

నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. “మొదటిసారి ఈ కథ విన్నప్పుడు బలమైన నమ్మకం కలిగింది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్. మా కృష్ణ పాత్ర కోసం సరైన హీరోని వెతుకుతున్న సమయంలో ‘నితిన్ అన్నను అడుగుదామా’ అని నాని సూచించారు. అనౌన్స్‌మెంట్ వీడియో షూట్ చేసిన తర్వాత ఆ లుక్‌లో నితిన్‌ను చూసిన క్షణమే ఆయనే మా కృష్ణ అని ఫిక్స్ అయిపోయాం. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్టుగా సరిపోయారు” అని తెలిపారు.