4 August, 2026 | 1:49 AM

ఇకనైనా నన్ను నేను మనిషిలా చూడటం నేర్చుకోవాలి!

04-08-2026 12:50 AM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడింది. రష్మికకు ఒక టెండన్ (నడుమును, కాలును కలిపే కండర బంధనం) ఊడిపోయింది. వైద్యుల సూచన మేరకు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న రష్మిక.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. “గాయాలు కావడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికీ తెలియకూడదనుకున్నా కానీ తెలిసిపోయింది.

నాకు గాయం కావటం మూడోసారి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలంటే, అది మళ్లీ అతుక్కోవాలి. ‘మైసా’ సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నా శరీరాన్ని ఒక మిషన్‌లా కాకుం డా మనిషిలా చూసుకోవడం ఇకనైనా నేర్చుకోవాలి. నేను ఎలాగూ స్వయంగా విరామం తీసుకోనని భావించి, దేవుడే నాకు ఈ బలవంతపు సెలవును ఇచ్చాడేమో! అయితే, ఈ నొప్పి భరించలేనంతగా ఏమీ లేదు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు.

రోజువారీగా కఠినమైన వర్కవుట్లు, రన్నింగ్ చేసే నాకు ఇప్పుడు బెడ్ రెస్ట్ దొరకడంతో బరువు పెరుగుతాననిపిస్తోంది. ఖాళీగా ఉంటే నాకు స్వీట్లు, డెజర్ట్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంది. వర్కవుట్ చేయకుండా బరువును ఎలా నియంత్రించుకోవాలో అర్థం కావడం లేదు. టైమ్‌పాస్ కోసం పజిల్స్ పూర్తి చేస్తుంటే.. అందులో నేను చాలా దిట్ట అని తెలుసుకున్నా! త్వరలోనే నా ఆరోగ్యంపై మరిన్ని అప్డేట్స్ ఇస్తా” అని పేర్కొంది.