11 June, 2026 | 2:11 AM

గురింపు ఇచ్చేది ఇంకెప్పుడు?

11-06-2026 01:09 AM
  1. జూనియర్ కాలేజీల అఫిలియేషన్‌లో ఇంటర్ బోర్డు జాప్యం
  2. ప్రైవేటే కాదు ప్రభుత్వ కాలేజీలకూ ఇంకా పూర్తి కాని ప్రక్రియ
  3. జూన్ 1 నుంచే ప్రారంభమైన విద్యాసంవత్సరం

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు అధికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ కాలేజీల గుర్తింపు (అఫిలియేషన్) అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నూతన విద్యాసంవత్సరం మొదలైనా ఇంకా పూర్తిస్థాయిలో జూనియర్ కాలేజీల అఫిలియేషన్ పూర్తి కాలేదని సమాచారం.

ప్రైవేట్ జూనియర్ కాలేజీలే కాదు...ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కాలేజీలకూ  సంబంధించిన గుర్తింపు ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాకపోవడం గమనార్హం. ఇది ఇంటర్ బోర్డు అధికారుల అలసత్వానికి నిదర్శనమనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై కూడా నాలుగు రోజులవుతుంది. కానీ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు.

ఆలస్యంగా గుర్తింపు ప్రక్రియ...

వేసవి సెలవులు పూర్తయిన తర్వాత 2026-27 నూతన విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు జూన్ 1 నుంచే పునఃప్రారంభమయ్యాయి. వాస్తవానికి మే 12 నుంచి 31 వరకు తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. దీంతో టెన్త్ పాసైన వారి తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసమని కాలేజీల వెతుకులాట ప్రారంభించి అడ్మిషన్లు కూడా పొందారు. అయితే మే 31లోగా కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు గతంలో ప్రకటించారు.

పైగా దీనికి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో అన్ని రకాల కాలేజీలు కలిపి దాదాపు 3,333 ఉన్నాయి. ఈనెల 2వ తేదీ వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రభుత్వ కాలేజీలు 430కు గానూ అనుమతులు వచ్చిన కాలేజీలు 302 మాత్రమే. 1403 ప్రైవేట్ కాలేజీలకు గానూ 210 కాలేజీలకు మాత్రమే అనుమతులివ్వగా, అదే 1500 ప్రభుత్వ రంగ కాలేజీలుంటే అందులో 800 కాలేజీలకు మాత్రమే గుర్తింపునిచ్చినట్లు తెలిసింది.

అంటే 3333 కాలేజీల్లో గుర్తింపునిచ్చిన కాలేజీలు కేవలం 1312 మాత్రమే. గుర్తింపుపొందని కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీలూ ఉండడం గమనార్హం. అఫిలియేషన్ ప్రక్రియ ఈసారి మరింత ఆలస్యమైనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కాలేజీకు గుర్తింపు ఉందో..ఏ కళాశాలకు లేదో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు తమకు నచ్చిన కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. 

ఎప్పుడూ ఇదే ఆలస్యం....

ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే ఈ విద్యాసంవత్సరం కూడా గుర్తింపు లేకుండానే విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇది వారికి షరా మామూలైంది. ఎప్పుడూ ఇదే సమస్య ఉత్పన్నమవుతున్నా గానీ వీటి నుంచి అటు అధికారులు, ఇటు కాలేజీల యాజమాన్యాలు పాఠాలు నేర్వడంలేదు. తెలిసి తెలియక విద్యార్థులు ఆ ఇంటర్ బోర్డు గుర్తింపు లేని కాలేజీల్లో చేరే పరిస్థితి. ఒకవేళ ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

కాలేజీల యాజమాన్యాలు కూడా సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతోనూ ఈ ఆలస్యానికి కారణంగా కనబడుతోంది. ఇంటర్ బోర్డు మాత్రం అర్హత ఉన్న ప్రతికాలేజీలకు గుర్తింపు ఇస్తామని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది. ఏదీఏమైనా అఫిలియేషన్ ప్రక్రియను ఇప్పటికైనా పూర్తి చేయాలనే డిమాండ్ విద్యార్థుల తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తోంది.