11 June, 2026 | 2:12 AM

రాజకీయ దుమారం!

11-06-2026 01:08 AM
  1. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై దేశవ్యాప్తంగా చర్చ
  2. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కాంగ్రెస్ వాదన
  3. తిరస్కరణ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపణలు
  4. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాజకీయ, చట్టపరమైన దుమారానికి దారితీసింది. మీనాక్షిని పోటీ నుంచి తప్పించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విపక్షం ఆరోపి స్తోంది. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి కావాలనే నామినేషన్ తిరస్కరించేలా చేశారని కాంగ్రె స్ నేతలు మండిపడుతున్నారు.

తిరస్కరణ అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను అఫిడవిట్‌లో దాచడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం ఫిర్యాదు చేసింది. 

అసలు కేసు ఏమిటి? 

ఈ వివాదం అంతటికీ తెలంగాణకు చెందిన ఒక మాజీ కాంగ్రెస్ మహిళా కార్యకర్త దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదే కారణం. ఆమె 2022లో తన పార్టీ సహచరుడు ఒకరు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ విషయా న్ని పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. నిందితుడి కుటుంబంలో ఐఏఎస్ అధికారులు ఉన్నందున పార్టీలో అతనికి గట్టి పట్టు ఉందని బాధితురాలు ఆరోపించారు.

ఈ కేసును మూసివేయడానికి ప్రయ త్నాలు జరిగాయని, తాను న్యాయం కోసం పోరాడినప్పుడల్లా అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు. చివరకు మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా వచ్చినప్పుడు ఆమెను వ్యక్తిగతంగా కలిసి న్యాయం చేయాలని కోరినట్లు బాధితురాలు వెల్లడించారు. నిందితుడిని సస్పెండ్ చేశామని మీనాక్షి హామీ ఇచ్చినా, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ఉత్తర్వులు తనకు చూపించలేదని స్పష్టం చేశారు.

దీంతో బాధితురాలు  2025 సెప్టెంబర్‌లో హైదరాబాద్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. తనను వేధించిన వ్యక్తితో పాటు మీనాక్షి నటరాజన్ పేరును అందులో చేర్చారు. మీనాక్షి నేరుగా ఆ వేధింపుల్లో పాల్గొనకపోయినప్పటికీ, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌గ్గా ఉండి కూడా నిందితుడిపై చర్యలు తీసుకోలేదన్నదే ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ కోర్టు 2025లో మీనాక్షికి నోటీసులిచ్చింది.

తెలంగాణలోనూ కాక

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కుట్రకోణం ఉందని సీఎం రేవంత్ రెడ్డి కుట్రకోణం దాగి ఉందనే సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో హస్తంలో ఆందోళన మొదలైంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారాయి.

మీనాక్షికి సంబంధించిన సమాచారాన్ని ఏ కాంగ్రెస్ నాయకుడు లీక్ చేసి ఉంటాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. తమపై ఏడ్చే ముందు కాంగ్రెస్ కోవర్టులను పట్టుకోవాలని బీజేపీ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. కోవర్టులు ఉన్నారా? అనేది హస్తం పార్టీలో అంతుపట్టని రహాస్యంగా మారింది. కాగా ఈ ప్రచారాలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎంపై దుష్ప్రచారం చేస్తున్న తెలుగు స్ర్కైబ్‌తోపాటు ఇతర సైట్లపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి డిజిటల్ మౌత్‌పీస్‌గా తెలుగు స్క్రైబ్ నడుస్తోందని, రాజకీయ దురుద్దేశంతో సీఎంపై అసత్య వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల పోలీసులను కోరారు.