11 June, 2026 | 2:13 AM

నక్సలైట్ కావాలనుకున్నా..

11-06-2026 01:12 AM
  1. నాడు నాకున్న ఆలోచన అది.. 
  2. చిరంజీవి నిర్మాణాత్మక మార్గం వైపు మళ్లించారు 
  3. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విధ్వేషాలు 
  4. రేవంత్‌రెడ్డి ప్రాంతీయ భేదాలు సృష్టిస్తున్నారు 
  5. సీఎం హోదాలో ఉన్నవారు ఉత్తర, దక్షిణ ప్రాంతాలంటూ మాట్లాడకూడదు 
  6. ఏపీ డిప్యూటీ  సీఎం పవన్‌కళ్యాణ్

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి) : ‘ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్‌గా మారిపోవాలని అనుకున్న. అదే సమయం లో నా అన్న చిరంజీవి గమనించి సమాజానికి ఉపయోగపడే ఓ నిర్మాణాత్మకమైన మార్గం వైపు మళ్లించారు’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. తన టీనేజ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ సంచలన విషయం బయటపెట్టారు.

తన చిన్నతనంలో సమాజంలో ఉన్న అసమానతలను చూసి చలించిపోయానని, కొంతకాలంగా కొందరు నన్ను టార్గెట్ చేస్తుండటం చూస్తుంటే నాటి రోజులు గుర్తుకొస్తున్నాయని.. పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తర, దక్షిణాది అనే భావన తీసుకురావడంపై పవన్‌కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఉత్తర, దక్షిణ ప్రాంతాలంటూ మాట్లాడవద్దని, ఈ భావన పెరిగితే దేశానికే ప్రమాదకరమన్నారు.

సమస్యలుంటే ఎక్కడైనా మాట్లాడవచ్చన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతీయులని.. మోదీ మాతృభాష హిందీ కాదని, ఆయన ఈ దేశాన్ని ఏకం చేశారని గుర్తు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు ప్రాంతాల పేరుతో వ్యాఖ్యలు చేస్తే ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోసారి దేశాన్ని విడదీసేలా ఉత్తర-, దక్షిణ కోణంలో మాట్లాడొద్దని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ప్రస్తుతం తన దృష్టంతా ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందన్నారు.

తెలంగాణలో తనకు బలమైన కేడర్ ఉందని, 2007కు ముందు నుంచే ఇక్కడి యువత తనతో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో  పోటీ చేయాలనే ఆసక్తి లేదని, అయతే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. తన సొంత దేశంలో, తన మాతృభూమిలో తాను ఎక్కడికైనా వెళ్తానని, ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని ఘాటుగా సమాధానమిచ్చారు.

బీఆర్‌ఎస్ నేతలెప్పుడూ అలా అనలేదు 

తెలంగాణకు రావద్దనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమేనని, పదేళ్లలో బీఆర్‌ఎస్ నేతలు ఎన్నడూ అలా మాట్లాడలేదని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విధ్వేషాలు మొదలయ్యాయన్నారు. ఓ జాతీయ పార్టీ ప్రాంతీయ విధ్వేషాలనులను రెచ్చగొట్టడం  వింతగా అనిపించిందన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వమని కొందరు అల్లరి మూకలను తనపైకి పంపుతున్నారని ఆరోపించారు.

13 నెలలుగా తనను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని.. మీ అయ్య జాగీరా? అని అనొద్దా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు సభ ఏర్పాటు చేయాలనుకున్నామని, ప్రభుత్వం అను మతించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను మళ్లీ హైదరాబాద్ రావొద్దని చెబితే.. అప్పుడు రాహుల్‌గాంధీకి ఓ మాట చెప్పాల్సి ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీకి దక్షిణ భారతదేశంతో ఏం సంబంధం ఉంది, ఆయన ఇక్కడి వాడు కాదు కదా.. అని తాను కూడా ప్రశ్నించాల్సి వస్తుందన్నారు.  

మోదీ, నా మధ్య దేశాభివృద్ధిపైనే చర్చ

మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పవన్ మీడియా సమావేశంలో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీ నాతో ఎప్పుడూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అద్భుతమైన నాయకుడు ఆయన. మా మధ్య ప్రతి డిస్కషన్ కేవలం దేశం, దేశాభివృద్ధి గురించే జరుగుతుంది’ అని తెలిపారు.  సినీఇండస్ట్రీలో వస్తున్న దేశభక్తి, జాతీయవాద సినిమాలపై ఆయన స్పందించారు. ‘ధురంధర్’తో పాటు కశ్మీర్ లోయలోని నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ‘బారముల్లా’ సినిమాలు తనకు నచ్చాయని చెప్పారు.

1980 చివరలో కశ్మీర్ లోయలో ఉన్న తీవ్రవాద పరిస్థితులను, 1987 నుంచి 1989 మధ్య కాలంలో తాను శ్రీనగర్‌లో గడిపిన రోజులను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఆ సమయంలో అక్కడ వాతావరణం చాలా భయానకంగా, ఉద్రిక్తంగా ఉండేదని చెప్పారు. తాము శ్రీనగర్ రోడ్లపై తిరుగుతున్నప్పుడు స్థానికులు మమ్మల్ని చూసి ఎగతాళి చేసేవాళ్లని, మీరెందుకు ఇక్కడికి వచ్చారని తమపై సీరియస్ అయ్యేవాళ్లని అప్పటి అనుభవాలను పవన్‌కళ్యాణ్ వివరించారు.