29 July, 2026 | 2:12 AM

రేవంత్‌కు కావాల్సింది.. నయా క్యాబినెట్!

29-07-2026 01:25 AM

2028 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో నడిచేందుకు..

* సాహసోపేతమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను అమలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పరివర్తనాత్మక నాయకుడిగా తన రాజకీయ స్థాయిని మరింత పెంచుకోవడంతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో విజయగాథగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమర్థవంతమైన, పారదర్శకమైన పాలనను కోరుకుంటున్న యువతరానికి ఇటువంటి మార్పు కొత్త ఆశను కలిగిస్తుంది.

* జెన్-జీకి రాజకీయాల్లో మరిం త ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం ముదావహం. సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా ప్రభావం చూపగల నిర్ణయాలను అమలుచేసే సామ ర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందనే అభిప్రాయం బలపడుతోంది.

తెలంగాణలో 2026 చివరినాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా అత్యంత కీలకమైన మలుపు వద్ద నిలిచారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమ యం మాత్రమే మిగిలిఉంది. అయితే.. పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లే ముందు ప్రజలకు పాలనాపరమైన ఫలితాలను స్పష్టంగా చూపించేందుకు ప్రభుత్వానికి మిగిలింది కేవలం ఏడాది సమయం మాత్రమే.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ముందున్న సవాళ్లు చిన్నవి కావు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, పార్టీలో అంతర్గత వర్గపోరు, కీలక ప్రాజెక్టుల అమలులో జాప్యం, ఆర్థిక వనరుల కొరత.. ఈ అంశాలన్నీ 2023లో కాంగ్రెస్‌కు లభించిన ప్రజాతీర్పు ను క్రమంగా బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలతో అధికారంలోకి రాగా, బీఆర్‌ఎస్ 39, బీజేపీ 8 స్థానాలకు పరిమితమయ్యాయి.

అయితే రేవంత్ రెడ్డి నాయకత్వమే కాంగ్రెస్‌కు బలమైన పునాది. ఆయన సంస్థాగత నైపుణ్యం, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యం ఇప్పటికే కొన్ని స్పష్టమైన రాజకీయ ఫలితాలను అందించాయి. 2026లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్య శక్తిగా ఎదగడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

జెన్-జీ యువతకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం ముదావహం. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకంటే సేవాభావానికి ప్రాధాన్యం ఇచ్చే సభ్యులను యాదాద్రి ఆలయ బోర్డులో నియమించడం వంటి ఇటీవలి నిర్ణయాలు సమర్థత, ప్రజా విశ్వాసం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా ప్రభావం చూపగల నిర్ణయాలను అమలుచేసే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందనే అభిప్రాయాన్ని ఇవి బలపరుస్తున్నాయి.

ప్రతిపక్షాల నుంచి బలమైన సవాల్

ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్‌ఎస్ కు రాజకీయ పోరాటాల్లో ఆరితేరిన కార్యకర్తలే బలం. సుదీ ర్ఘ పాలనా అనుభవం, గణనీయమైన ఆర్థిక వనరులు ఉ న్నాయి. కేటీఆర్, హరీశ్ రావు వంటి చురుకైన నేతలు రాజకీయ సారథులుగా ఉన్నారు.

రైతు సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవం వంటి ప్రధాన అంశాలపై ప్రజలతో మళ్లీ అనుసంధానం కావడానికి బస్సు యాత్రలు, పాదయాత్రలు, ప్రజా ఆందోళనలతో ముందుకు వెళ్లే వ్యూహాలు కనిపిస్తున్నా యి. ప్రాంతీయ పార్టీగా బలమైన పునాదులు, సొంత మీడియా వ్యవస్థ, ప్రజల నాడిని అర్థం చేసుకునే రాజకీయ అనుభవం బీఆర్‌ఎస్‌కు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకునే ప్రతి లోపాన్ని అవకాశంగా మార్చుకోగలిగితే ఆ పార్టీ బలమైన పునరాగమనానికి సంకేతాలే అవుతాయి.

మరోవైపు బీజేపీ మరింత విస్తృతమైన సవాల్‌ను విసురుతోంది. జాతీయ స్థాయి వనరులు, హిందుత్వ సమీకరణ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతల సంస్థాగత సామర్థ్యం, ఆర్‌ఎస్‌ఎస్ నెట్వర్క్ మద్దతుతో తెలంగాణలో తన పరిధిని విస్తరించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి నుంచి పకడ్బందీ నిర్వహణ, కేంద్ర దర్యాప్తు సంస్థల సమర్థవంతమైన వినియోగం, మీడియాపై ప్రభావం, వ్యూహాత్మక పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలు కూడా బీజేపీ రాజకీయ వ్యూహంలో కీలకంగా మారవచ్చు.

మహిళా రిజర్వేషన్లు, ఇతర జాతీయ పథకాలు కొన్ని కీలక ఓటరు వర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. గవర్నర్ పాలన దిశగా వెళ్ల డం, జమిలి ఎన్నికలకు ప్రయత్నించడం, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వంటి అంశాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకోవడం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాన రాజకీయ అస్త్రాలుగా మలచుకోవడం వంటి అవకాశాలనూ విస్మరించలేం.

సామర్థ్యానికే ప్రాధాన్యం..

ఆర్థిక శాఖ వంటి కీలక విభాగాల్లో ఆర్బీఐ లేదా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులను, పరిశ్రమల శాఖలో ప్రముఖ కార్పొరేట్ సంస్థల నుంచి స్వచ్ఛమైన రికార్డు కలిగిన వృత్తి నిపుణులను తీసుకురావడం ద్వారా ‘పరిచయాల కంటే ప్రతిభకే ప్రాధాన్యం’ అనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వగలదు. రాజకీయాలను వ్యక్తిగత సంపద సృష్టించుకునే మార్గంగా కాకుండా ప్రజాసేవగా భావించే వ్యక్తులే ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉండాలి.

దుద్దిళ్ల శ్రీధర్ బాబును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీ, ప్రభుత్వ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. పాత, కొత్త వర్గాల మధ్య వారధిగా వ్యవహరించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకు ఉంది. అవసరమైతే ఎమ్మెల్సీ మార్గం ద్వారా ఎమ్మెల్యేలు కాని వ్యక్తులకు కూడా అవకాశం కల్పించవచ్చు. ఇందుకోసం వ్యూహాత్మకంగా కొన్ని రాజీనామాలను ప్రోత్సహించే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. సమర్థత, స్వచ్ఛమైన పాలన అనే లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులైతే ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన వారినీ ఆహ్వానించడం ద్వారా ‘పార్టీల కంటే ఫలితాలకే ప్రాధాన్యం’ అనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వగలదు.

కొత్త మంత్రివర్గం నిజాయతీ, సమర్థత, సమగ్ర ప్రాతిని ధ్యం అనే మూడు ప్రధాన లక్షణాలను ప్రతిబింబించాలి. అవినీతి లేదా నిష్క్రియపై వ్యక్తిగత మంత్రులను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ప్రతిపక్షానికి తగ్గితే, రాజకీయ చర్చను ప్రభు త్వ విధానపరమైన విజయాల వైపు మళ్లించవచ్చు. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాల వృద్ధిని ఆధారంగా చేసుకుని 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు.

జాతీయ స్థాయిలోనూ ప్రతిధ్వనించే అవకాశం

రాహుల్‌గాంధీకి జాతీయ స్థాయి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పునరుజ్జీవన వ్యూహంతో తెలంగాణలో ఇలాంటి మార్పులు సమన్వయం కావచ్చు. తెలంగాణలో తీసుకునే నిర్ణయాత్మక చర్యలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఒక నమూనాగా నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ క్షీణిస్తోందనే రాజకీయ కథనాన్ని ఎదుర్కొంటూ, అవసరమైనప్పుడు తన లోపాలను గుర్తించి సరిదిద్దుకోగల సామర్థ్యం పార్టీకి ఉందని నిరూపించేందుకు తెలంగాణ ఒక వేదికగా మారవచ్చు. ఇక్కడ సాధించే విజయం బీజేపీ ప్రచారం చేసే ‘కాంగ్రెస్ ముక్త్ భార త్’ రాజకీయ లక్ష్యాన్ని ఎదురుదెబ్బ తీయడంతోపాటు ప్రాం తీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వినూత్నంగా వ్యవహరించగలవని చాటే అవకాశం ఉంటుంది.

రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చూపిన రాజకీయ శైలి చూస్తే, ఇటువంటి ‘సంచలనాత్మక మార్పులు’ చేపట్టగల దృఢ సంకల్పం ఆయనకు ఉందనే అంచనా ఉంది. యాదాద్రి ఆలయ బోర్డు నియామకాల్లో ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రతిభ ఆధారిత ఎంపికలకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదే విధానాన్ని మంత్రివర్గమంతటా విస్తరించగలిగితే, మిగిలిన పాలనా కాలంలో స్పష్టమైన, సమర్థవంతమైన ఫలితాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను నేరుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

వ్యూహాత్మక కార్యాచరణ..

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతోనే పని పూర్తికాదు. కాంగ్రెస్ తన నిర్మాణాత్మక సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. జాప్యం జరుగుతోందన్న విమర్శలకు సమాధానంగా కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని పటిష్ఠం చేయాలి. సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలి.

ఎన్నికల వయస్సుకు సంబంధించిన ప్రతిపాదనను కొనసాగిస్తూ యువత, మహిళలను కేంద్రంగా చేసుకున్న రాజకీయ కార్యక్రమాలను విస్తరించాలి. జనాభాలో గణనీయమైన వాటా ఉన్నప్పటికీ చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేని జెన్-జీ యువత, భవిష్యత్తు దృష్టితో ముందుకు సాగే కాంగ్రెస్‌కు సహజమైన రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ కూడా అత్యంత కీలకం.

రాష్ట్ర ఆర్థిక వనరులపై ఒత్తి డి ఉన్న పరిస్థితుల్లో అత్యధిక ప్రజా ప్రయోజనం కలిగించే రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ, అవినీతికి తావులేని వ్యయ విధానాన్ని అమలు చేయాలి. తద్వారా ప్రభుత్వంపై విశ్వసనీయత పెరుగుతుంది. పరిశ్రమలు, ఐటీ వంటి కీలక శాఖలను సామర్థ్యం కలిగిన నిపుణుల చేతుల్లో ఉంచితే కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆర్థిక వ్యవస్థపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడం సులభమవుతుంది.

అన్నింటికంటే పార్టీ అంతర్గత ఐక్యత విషయంలో రాజీకి తావుండకూడదు. పాత, కొత్త నాయకత్వాల మధ్య అంతరాలను తగ్గించడం, 2028 ఎన్నికల్లో సమగ్ర సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల పంపిణీ చేయడం ద్వారా పార్టీ ఫిరాయింపులను తగ్గించి ఓటు బ్యాంకును ఏకీకృతం చేయవచ్చు.

ఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ చర్చలు ఈ అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడానికి సరైన వేదికగా చెప్పవచ్చు. సాహసోపేతమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను అమలు చేస్తే రేవంత్ రెడ్డి ఒక పరివర్తనాత్మక నాయకుడిగా తన రాజకీయ స్థాయిని మరింత పెంచుకోవడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో విజయగాథగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమర్థవంతమైన, పారదర్శకమైన పాలనను కోరుకుంటున్న యువతరానికి ఇటువంటి మార్పు కొత్త ఆశను కలిగిస్తుంది.

రాజకీయ పరిస్థితులు వేగంగా మారే తెలంగాణ వంటి రాష్ట్రంలో సమస్యలు ముదిరిన తర్వాత రక్షణాత్మకంగా స్పందించడం కంటే ముందుగానే మార్పును చేపట్టడం ఉత్తమ వ్యూహం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌లో ఇందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయి. చురుకైన నాయకత్వం, మార్పు కోసం లభించిన ప్రజా తీర్పు, అవసరానికి అనుగుణంగా తమను తాము పునర్నిర్మించుకునే అవకాశం వారి చేతుల్లో ఉంది. సంచలనాత్మక మార్పులతో కూడిన.. ‘ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేసే మంత్రివర్గం’ను ఏర్పాటుచేయడం ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కీలక అడుగుగా మారవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ మనుగడకు ఇదే అత్యంత నిర్ణయాత్మక సమాధానంగా నిలిచే అవకాశం ఉంది.

    అంతర్గత బలహీనతలు.. 

    కాంగ్రెస్‌కు సవాళ్లు బయట నుంచే కాదు.. పార్టీ లోపల కూడా ఉన్నాయి. పాత, కొత్త నాయకత్వాల మధ్య వర్గ విభేదాలు, నిధుల కొరత, కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి, ఎస్సీ సామాజిక సమీకరణలకు సంబంధించిన విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చు. హామీ ఇచ్చిన ప్రాజెక్టుల అమలులో జాప్యం, ఇంకా తొలగిపోని అవినీతి ఆరోపణలు ప్రతిపక్షానికి రాజకీయ అస్త్రాలుగా మారాయి. ప్రభుత్వ పదవీకాలం మధ్య దశలోనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని తమ అంతర్గత సర్వేలు సూచిస్తున్నాయని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం కూడా కాంగ్రెస్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే హెచ్చరికలు ఇస్తోంది.

    మంత్రివర్గ ప్రక్షాళన అత్యవసరం 

    ఈ నేపథ్యంలో తక్షణమే అత్యధిక ప్రభావాన్ని చూపగల నిర్ణయం.. ‘సమగ్ర ఎన్నికల మంత్రివర్గ’ పునర్వ్యవస్థీకరణ మాత్రమే. మంత్రివర్గంలో పనితీరు సరిగా లేని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖాలను పక్కనపెట్టి, విశ్వసనీయత, స్వచ్ఛమైన ప్రతిష్ఠ కలిగిన నేతల కు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తనను తాను పునరుద్ధరించుకుంటుందనే బలమైన సంకేతా న్ని ప్రజల్లోకి పంపవచ్చు. ఈ మార్పు కేవలం మంత్రుల మార్పిడిగా మిగిలిపోకూడదు.

    అది ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాలి. ప్రజల్లో విస్తృతంగా చర్చకు రావాలి. రోజువారీ పాలనలో దాని ప్రభావం కనిపించాలి. అప్పుడే ప్రజా విశ్వాసాన్ని తిరిగి బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్ష విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పగలుగుతుంది. ఈ దిశగా కొన్ని పేర్లను పరిశీలించడం ప్రభుత్వ ప్రతిష్ఠను మార్చగలదు. 

    మేధోసంపత్తి, నిజాయతీకి పేరున్న కోదండరాం వంటి నేతలకు అవకాశం కల్పించవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఉత్సాహం, ఆర్థిక సామర్థ్యం కలిగిన చురుకైన నాయకుడు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపు ఉందనే అభిప్రాయం ఉంది. ప్రజలకు సహాయం చేసే స్వభావం కారణంగా ఆయనకు విస్తృత ఆదరణ ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

    ప్రజల విజ్ఞప్తి మేరకు బెల్ట్ షాపుల మూసివేతకు కృషి చేయడం వంటి చర్యలు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయని భావిస్తున్నారు. ఇటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యశస్విని రెడ్డి వంటి నేతలు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలరు.

    ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నుంచి యువ ప్రతిభకు అవకాశం కల్పిస్తే మంత్రివర్గానికి కొత్త శక్తి లభిస్తుంది. విస్తృత సామాజిక ప్రాతినిధ్యం కోసం బీసీ వర్గాల్లో పార్టీ పునాదిని బలోపేతం చేసే దిశగా మహేశ్ కుమార్‌గౌడ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిశీలించవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా కీలక బాధ్యతల్లో వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయ, ప్రాంతీయ సమతుల్యత సాధించవచ్చు.

    సి.ఎల్.రాజం

    చైర్మన్, విజయక్రాంతి