29 July, 2026 | 1:14 AM

డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై ఉక్కుపాదం

29-07-2026 12:06 AM
  1. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు
  2. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి - 
  3. వనస్థలిపురం ఏసీపీ ఆఫీస్‌లో వార్షిక తనిఖీలు 

ఎల్బీనగర్, జులై 28 : ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి నేరాన్నీ ఉపేక్షించొద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, వాటి దర్యాప్తు, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీపీ సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొంటూ ’మీ సురక్ష’, ’సహచరి’ యాప్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి నేరాల నియంత్రణను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.

అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సందేశమిచ్చారు. ఈ సమీక్షలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అదనపు డీసీపీ రామేశ్వర్రావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ఇన్స్పెక్టర్లు రవికుమార్, అశోక్రెడ్డి, శంకరయ్య, రాజేష్, సంతోష్కుమార్, డీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.