29 July, 2026 | 1:53 AM

నిరుద్యోగ యువ భారత్!

29-07-2026 12:47 AM
  1. ప్రతి ముగ్గురిలో ఇద్దరు నిరుద్యోగులే
  2. భారత్‌లో యువ పట్టభద్రుల సంఖ్య 6.3 కోట్లు
  3. వీరంతా 20--29 ఏళ్ల వయసు గల వారే
  4. గత 43 ఏళ్లలో 16 రెట్లు పెరిగిన నిరుద్యోగం
  5.    1883లో ఉద్యోగం లేనివారు 7 లక్షలైతే.. నేడు 1.1కోట్లు
  6. పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగినా.. దొరకని కొలువులు
  7. జాబ్‌లు లేనివారు తెలంగాణలో 52.3 శాతం, ఏపీలో 51.6 శాతం  
  8. అజీమ్ ప్రేమ్‌జీ ‘2026 ఎస్‌డబ్ల్యూఐ’ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 28: భారతదేశ యువత నిరుద్యోగ వైరుధ్యంతో సతమతమవుతోంది. ఉద్యోగం లేని యువతలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పట్టభద్రులే ఉండడం కలిచివేస్తోంది. భారత్‌లో యువ పట్టభద్రుల సంఖ్య 6.3 కోట్లు ఉన్నారు. వీరంతా 20--29 ఏళ్ల వయసు గల వారే కావడం గమనార్హం. గత 43 ఏళ్లలో 16 రెట్లు నిరుద్యోగం పెరిగింది. ఇది ఏడు లక్ష మంది నిరుద్యోగుల సంఖ్య నుంచి నేడు 1.1కోట్ల మందికి చేరింది.

1883 నుంచి పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగినా.. కొలువులు మాత్రం అంతంతే దొరుకుతున్నాయి. నిరుద్యోగులు నివసించే ప్రాంతాల రీత్యా కూడా తీవ్ర వ్యత్యాసం ఉంది. 30 ఏళ్లలోపు పట్టభద్రులైన పురుషులలో నిరుద్యోగం ఢిల్లీలో 8.8 శాతం ఉండగా, ఒడిశాలో 40.3 శాతం వరకు ఉంది. గ్రాడియేట్లున మహిళల్లో ఇది జమ్ముకశ్మీర్‌లో 73.5 శాతానికి, తెలంగాణలో 52.3 శాతానికి, ఏపీలో 51.6 శాతానికి చేరుకుంది. జాతీయ గణాంకాల ప్రకారం పురుషులలో 25.1 శాతం, మహిళలలో 36.6 శాతం నిరుద్యోగం ఉంది.

ఈ మేరకు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘2026 స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’(ఎస్‌డబ్ల్యూఐ) నివేదికలో వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాలుగా విస్తరిస్తున్న ఉన్నత విద్య ఏమి సాధించిందో, ఏమి సాధించలేదో ఎస్‌డబ్ల్యూఐ నివేదిక తెలియజేసేంది. ఎస్‌డబ్ల్యూఐ రిపోర్టు ప్రకారం.. భారతదేశంలో నేడు 20--29 ఏళ్ల వయస్సు గల పట్టభద్రుల సంఖ్య 6.3 కోట్లకు పెరిగింది. 1983లో ఈ సంఖ్య 50 లక్షలుగా ఉండేది.

ఇదే కాలంలో, వారిలో నిరుద్యోగుల సంఖ్య ఏడు లక్షల నుంచి 1.1 కోట్లకు పెరిగింది. పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగింది. ఉద్యోగం లేని పట్టభద్రుల సంఖ్య 16 రెట్లు పెరిగింది. అతి చిన్న వయసులో పట్టభద్రులైన వారిలో, ఫెయిల్యూర్ రేటులో దాదాపుగా ఎలాంటి మార్పూ కన్పించలేదు. 25 ఏళ్లలోపు పట్టభద్రులలో నిరుద్యోగం 1983లో 35 శాతంగా ఉండగా, 2023 నాటికి అది 39.3 శాతానికి పెరిగింది.

అంటే, ఈ నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య కేవలం నాలుగు శాతం పాయింట్లు మాత్రమే మారింది. అయితే భారతదేశం తన యువ పట్టభద్రులకు ఉపాధి కల్పించడంలో ఏమాత్రం వెనుకబడలేదు. వారిని తయారు చేయడంలో చాలా మెరుగుపడింది కానీ, సమస్యలోని రెండో భాగాన్ని ఎన్నడూ పరిష్కరించలేదు. 

కొంచెం పెద్ద వయసున్న పట్టభద్రుల విషయానికొస్తే, పరిస్థితి మరింత దిగజారింది. 25--29 ఏళ్ల మధ్య వయసు వారిలో, నిరుద్యోగం 1983లో 12.2 శాతం నుంచి 2023 నాటికి 20 శాతానికి దాదాపు రెట్టింపు అయింది. ఒక పట్టభద్రుడు ఉద్యోగం కోసం వేచి ఉండే సంవత్సరాలు ఇప్పుడు, గతంలో కంటే ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తుంది. 1983లో 20-29 ఏళ్ల వయస్సు గల భారతీయులలో పట్టభద్రులు నాలుగు శాతం ఉండేవారు.

ఇప్పుడు వారు 28 శాతానికి పెరిగారు. భారతదేశం వంటి ఆదాయ స్థాయి ఉన్న దేశానికి ఆశించిన స్థాయిలోనే ఉన్నత విద్యలో నమోదు ఉందని, పురుషుల కంటే మహిళల్లో ఈ పెరుగుదల మరింత స్పష్టంగా ఉందని నివేదిక పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందని విషయం ఏమిటంటే, చదువు పూర్తయ్యాక లభించే ఉద్యోగాల రకం. 2004 నుంచి 2023 మధ్య, భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల మంది పట్టభద్రులు చేరారు.

వారిలో సుమారు 28 లక్షల మంది ఏదో ఒక రకమైన ఉద్యోగాన్ని పొందారు. కేవలం 17 లక్షల మంది మాత్రమే జీతం వచ్చే ఉద్యోగాలను సంపాదించారు. తాము నిరుద్యోగులమని ప్రకటించుకున్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు పరిశీలించగా, యువ పట్టభద్రులలో సగం మంది ఏదో ఒక రకమైన ఉద్యోగాన్ని పొందుతున్నారని నివేదికలోని ప్యానెల్ డేటాలో వెల్లడైంది. వీరిలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే శాశ్వత జీతభత్యాల ఉద్యోగాన్ని పొందుతుండగా, 3.7 శాతం మంది వైట్-కాలర్ ఉద్యోగాలను పొందుతున్నారు.

ఢిల్లీలో 8.8 శాతం నిరుద్యోగం

పట్టభద్రుడు నివసించే ప్రదేశం కూడా అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. 30 ఏళ్లలోపు పట్టభద్రులైన పురుషులలో నిరుద్యోగం ఢిల్లీలో 8.8 శాతం ఉండగా, ఒడిశాలో 40.3 శాతం వరకు ఉంది. పట్టభద్రులైన మహిళలలో ఇది జమ్ముకశ్మీర్‌లో 73.5 శాతానికి, తెలంగాణలో 52.3 శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 51.6 శాతానికి చేరుకుంది. జాతీయ గణాంకాల ప్రకారం పురుషులలో 25.1 శాతం, మహిళలలో 36.6 శాతం ఉంది.

చాలా రాష్ట్రాలలో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, కానీ అన్ని రాష్ట్రాలలో కాదు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బంగాల్‌లో పట్టభద్రుల నిరుద్యోగ రేటు పురుషుల కంటే మహిళలలో తక్కువగా ఉంది. తాజా అధికారిక సంఖ్యలు నివేదిక కంటే ఇటీవలివి. అవి కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయి.

2025 క్యాలెండర్ సంవత్సరం వరకు కొనసాగే ప్రభుత్వ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ వార్షిక శ్రేణి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. అన్ని వయసుల వారిలో పట్టభద్రుల నిరుద్యోగం 11.2 శాతంగా(పురుషుల్లో 9శాతం, మహిళల్లో 17.4శాతం) ఉందని నివేదిక తెలిపింది. ఇది యువత గణాంకాల కంటే చాలా విస్తృతమైన జనాభా, ఎందుకంటే ఇందులో నలభై, యాభై ఏళ్ల వయసులో ఉన్న, ఎక్కువగా ఉద్యోగాలలో స్థిరపడిన పట్టభద్రులు కూడా ఉన్నారు. ఇందులోనూ పురుషులతో పోలిస్తే మహిళల నిరుద్యోగరేటు రెట్టింపుగా ఉందని పేర్కొంది.

డిగ్రీ ఇప్పటికీ విలువైనదే..

డిగ్రీ ఇప్పటికీ విలువైనదేనని ఎస్‌డబ్ల్యూఐ నివేదిక వెల్లడించింది. పట్టభద్రుల జీతాలు పట్టభద్రులు కాని వారి జీతాల కంటే దాదాపు రెట్టింపుతో ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ఈ ఆధిక్యత తగ్గుతోందని, సుమారు 2017 నుంచి పట్టభద్రుల సంపాదన స్తంభించిపోయిందని వెల్లడించింది. కానీ అది పూర్తిగా కనుమరుగవలేదని పేర్కొంది. డిగ్రీ ఇప్పటికీ ప్రతిఫలాన్ని ఇస్తుంది.

పెరిగింది ఏమిటంటే, ఆ ప్రతిఫలం లభించడం మొదలయ్యే ముందు పట్టే నిరీక్షణ, ఆ నిరీక్షణ తర్వాత లభించే మొదటి ఉద్యోగం గతంలో కంటే అధ్వాన్నంగా ఉందని చెప్పింది. జాతీయ నమూనా సర్వే విద్యా మాడ్యూల్ ప్రకారం.. 2025లో సుమారు 37.8 శాతం సెకండరీ -స్కూల్ విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్‌లో చేరారు. ప్రాథమిక స్థాయిలో 22.9 శాతంగా ఉన్న ఈ సంఖ్య, ఉన్నత-సెకండరీ విద్యార్థులలో 37 శాతంగా ఉందని చెప్పింది. గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా, భారతదేశం సుమారు 33 లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తోందని పేర్కొంది.