హైడ్రా ఆగదు
- ఇది మేం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ
- అధికారుల నియామకంలో ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు
- సోమేష్‌కుమార్‌పై 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు
- బీఆర్‌ఎస్ నేతల కబ్జాలపై కేసులు
- గ్లోబరీనా అక్రమాలకు గత ప్రభుత్వమే కారణం
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇక సమస్య కాదు
- క్రమం తప్పకుండా చెల్లిస్తాం.. బ్యాంకుల్లో జమచేస్తాం
- ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి
- తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు ఇవ్వండి
- కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వినతి
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది. కబ్జాల తొలగింపుపై వెనక్కి తగ్గేదే లేదు. హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా. ప్రభుత్వ పార్కులు, చెరు వులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా ప్రధాన బాధ్యత.
ఆ దిశగా సంస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమని, దానిని ఎవ రూ ప్రశ్నించలేరని, ఆ అధికారాన్ని ఎవ రూ లాక్కోలేరని ఆయన స్పష్టంచేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించినోళ్లు కోర్టులను తప్పు దోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని విమర్శించారు.
కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేష్‌కుమార్‌పై 400కు పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడి యాతో మాట్లాడారు. న్యాయస్థానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపా రు.
బతుకమ్మ కుంటను బీఆర్‌ఎస్ వాళ్లు కబ్జా చేశారని, పైగా దానిపై కంటెంప్ట్ కోర్టు కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్, గండిపేట చెరువు ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు పేదలపై కాదని, ఆక్రమణదారులపై మాత్రమేనని స్పష్టంచేశారు. కబ్జాదారులను కాపాడేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, కబ్జాకోరులకు సహకరించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధిహామీ పనుల విషయంలో సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి మంత్రి స్పందించారని సీఎం తెలిపారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్లు సీఎం పేర్కొన్నారు.
వర్సిటీలపై ఆధిపత్యం వద్దు..
ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు నమ్మకం కలిగించేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షల సమయంలో సమస్యలు తక్కువగా ఉన్నాయని, ఆఫ్‌లైన్ విధానంలోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా పెరుగుతున్న కోచింగ్ సెంటర్లు ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని విమర్శించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఒక సమగ్ర విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీఎం సూచించారు.
విద్యను రాష్ట్రాల పరిధిలో ఉంచితే పరిపాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఎస్సీ తరహా విధానాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని సీఎం తెలిపారు. గ్లోబరీనా వంటి సంస్థల అక్రమాలపై గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే అవి మరింత విస్తరించాయని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇకపై ఆలస్యం కాదు
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇకపై ఆలస్యం కాదని, ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను అదే ఏడాది పూర్తిగా చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అవసరమైతే ముందస్తుగానే వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ర్టంలో ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్ల వరకు అవసరమవుతుందని పేర్కొన్నారు.
సరైన వసతులు లేకుండా, తప్పుడు లెక్కలతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు ప్రయత్నించే సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేసిందనే భావన కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, దానికి బీజేపీ కూడా మద్దతు ఇస్తోందని సీఎం విమర్శించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వదిలి వెళ్లిందని, ఆ సమస్యను పరిష్కరించడంతో పాటు , భవిష్యత్తులో సమస్యలు రాకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఏపీలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ఎంపీ ఆర్. కష్ణయ్య ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయించిన తర్వాత తెలంగాణపై డిమాండ్లు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలకు సూచించారు.
కేంద్ర మంత్రి చౌహాన్‌తో సీఎం భేటీ..
పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద 11,56,915 ఇండ్లను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం పీఎంఏవై-జీ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్ల నిర్మాణంలో వెనుకబాటు ఏర్పడిందని సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు వివరించారు. వీలైనంత త్వరగా ఇండ్ల కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉపాధిహామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
రైతుల భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇంటి పరిసరాల్లో కూరగాయల తోటలు, వెదురు సాగు వంటి పనులకు అవకాశం కల్పించాలన్నారు. కొండప్రాంతాల్లో నీటినిల్వల కోసం కందకాల నిర్మాణం, పండ్ల తోటల్లో తేమ పరిరక్షణ పనులు, వరదలు, ఇసుక మేటల వల్ల దెబ్బతిన్న భూముల పునరుద్ధరణను కూడా చేర్చాలన్నారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురాంరెడ్డి, సురేష్‌షెట్కార్, వంశీకష్ణ, అనిల్ ఉన్నారు.






