కఠిన చర్యలు వద్దు
నీట్ లీక్ ఆందోళనల్లో మైనర్లు, నేరచరిత్ర లేనివారిని వెంటనే విడుదల చేయండి
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ
పోలీసుల అత్యుత్సాహంపై నిష్పాక్షిక దర్యాప్తునకు సిట్‌ను ఎందుకు వేయొద్దు?.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టొద్దు: సీజేఐ
న్యూఢిల్లీ, జూలై 28: నీట్ పేపర్ లీక్, పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై బల వంతపు చర్యలు తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే 18 ఏళ్లలోపు వారిలో ఎవరికీ ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదనే షరతుపై వారిని విడుదల చేయాలని ఆదేశించింది. అరెస్టు చేసిన మైనర్లు, నేరచరిత్రలేని వారిని వెంటనే విడుదల చేయాలని, అయితే కేసుల దర్యాప్తు మాత్రం చట్టప్రకారం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
పోలీసుల అత్యు త్సాహంపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రొటోకాల్స్ ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం హెచ్చరించింది. అవసరమై తే, పిల్లలు గానీ లేదా వారి కుటుంబ సభ్యులు గానీ ఒక సాధారణ పూచీకత్తుపై సంతకం చేసిన మీదట వారిని విడుదల చేయాలని, ముఖ్యంగా హామీ కోసం అటువంటి షరతు విధించినట్లయితే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు చర్యలపై సిట్ ఏర్పాటుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యబాగ్చి, వీ మోహనతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అన్ని ఆరోపణలపై ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా స్వతంత్ర, పారదర్శక, సమగ్ర విచారణ జరిపించాలని ధర్మాసనం యోచిస్తున్నట్లు పేర్కొంది.
నిరసనల సమయంలో 250మంది పోలీసులపై దాడికి పాల్పడింది విద్యార్థులా లేక ఆందోళనల్లోకి చొరబడిన క్రిమినల్సా అనే కోణంలో దర్యాప్తు జరగాలని సూచించింది. ఈ అంశాలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. పోలీసులపై విద్యార్థులు దాడులు చేయలేదని, నిరసనల ముసుగులో నేరస్థులు ప్రవేశించి హింసకు పాల్పడ్డారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆందోళనల పేరుతో జరిగే హింసను లేదా పోలీసుల లాఠీచార్జిని సమర్థించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నిష్పక్షపాతమైన, స్వతంత్ర విచారణ అవసరాన్ని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పలు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులపై కఠిన చర్యలు వద్దు
నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ, విద్యార్థులపై ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అయితే, నేరాభియోగాలున్న ఆందోళనకారులకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
అలాగే నిరసనలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ రికార్డింగ్స్ సహా అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది. పిటిషన్‌లలో చేసిన ఆరోపణలు ప్రాథమికంగా పరిశీలిస్తే స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని భావిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ డిజిటల్ డేటాను బహిరంగంగా వెల్లడించకూడదని కూడా ఆదేశించింది.
నిరసనల్లో సంఘవిద్రోహ శక్తులు
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై లాఠీఛార్జ్, పెలెట్ గన్స్, టియర్గ్యాస్, విద్యుత్ ఆధారిత ఆయుధాలను వినియోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 20, 21లను ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు. పెలెట్ గన్స్ వల్ల కొందరికి తీవ్ర గాయాలయ్యాయని, ఒక నిరసనకారుడు చూపు కోల్పోయాడని, మేకులు అమర్చిన లాఠీలతో కొట్టడం వల్ల శాశ్వత వైకల్యం ఏర్పడిందని, ఓ మీడియా ప్రతినిధిపై కూడా దాడి జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరోవైపు పోలీసుల తరఫున కూడా వాదనలు వినిపించారు. నిరసనల్లో సంఘవిద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడ్డాయని, పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని వారి తరఫు న్యాయవా దులు కోర్టుకు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించిన వివరాలు కూడా రికార్డులో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
ఈ విషయాన్ని తదుపరి విచారణ కోసం ఆగస్టు 3కు వాయిదా వేస్తూ, స్వతంత్ర కమిటీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటును పరిశీలించే ముందు, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారి వాదనలను రికార్డులో నమోదు చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మహారాష్ట్ర, బీహార్, అసోం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీన ఆన్లైన్‌లైన్‌లో హాజరు కావాలని ఆ రాష్ట్రాల అడ్వకేట్ జనరల్లను కోరింది.






