ఏ నిరసనకారుడూ ఒంటరి కాదు
భవిషత్‌లో ఎలాంటి చర్యలూ ఉండవని కేంద్రం హామీ
సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్
న్యూఢిల్లీ, జూలై 28: తమతో కలిసి పోరాడిన ఏ నిరసనకారుడినీ ఒంటరిని చేయబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులతో సోమవారం అర్ధరాత్రి చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని వారు తమకు హామీ ఇచ్చారన్నారు. బీహార్, అసోంలో ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఆయా ప్రభుత్వాలు ఉపసంహరించు కున్నాయని తెలిపారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయడంపైనా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయాలని కోరామన్నారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. అయితే సీజేపీ నేతృత్వంలో జంతర్మంతర్ వద్ద ఆందోళనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆందోళనల్లో పాల్గొన్న వారి ఫేషియల్ రికగ్నిషనన్ను ఢిల్లీ పోలీసులు చేపట్టారు. వారిలో 2,873 మందికి క్రైమ్ రికార్డులు ఉన్నట్లు తేలింది. 101 మందిపై హత్య, 62 మందిపై హత్యాయత్నం, 284 మందిపై దోపిడీ, 25 మందిపై లైంగిక వేధింపులు, 229 మందిపై ఆయుధాల చట్టం ఉల్లంఘన, 61 మందిపై అత్యాచారం ఆరోపణలు, ఆరుగురిపై పోక్సో వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పలువురు నిరసనకారులు ఉద్దేశపూర్వకంగానే భద్రతాబలగాలపై దాడి చేశారని, ఆ వీడియోలు సైతం సేకరించామని పేర్కొన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు.






