రిజర్వేషన్ హఠావో
- తెరపైకి కొత్త డిజిటల్ ఉద్యమం
- 57 లక్షల ఫాలో వర్లతో వైరల్
- కులం కాదు.. ఆర్థిక ప్రాతిపదికే ప్రామాణికం
- ‘సమానత్వం, మెరిట్, న్యాయం’ నినాదంతో ప్రచారం
- రాజకీయాలకు సంబంధం లేదని నిర్వాహకుల స్పష్టీకరణ
- సోషల్ మీడియా ఉద్యమంపై దేశవ్యాప్త చర్చ
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): దేశంలో సోషల్ మీడియా వేదికగా కొత్త తరహా ఉద్యమాలకు ఊపు పెరుగుతోంది. విద్యా వ్యవస్థలో లోపాలు, నీట్ ప్రశ్న పత్రం లీక్, నియామకాల్లో అవకతవకలపై చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా, అదే బాటలో ఇప్పుడు మరో ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ పేరిట సోషల్ మీడియా వేదికంగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. ప్రస్తుత రిజర్వేషన్ల విధానంపై దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.
కుల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో ఆర్థిక పరిస్థితులు, ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సాగుతున్న ఈ ఉద్యమం.. సోషల్ మీడియాలో వేగంగా ఆదరణ పొందుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. నెలరోజుల పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగించిన నిరసన దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ నిరసనల ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మరింత చర్చకు దారితీసింది.
ఇప్పుడు అదే తరహాలో సోషల్ మీడియా వేదికగా ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ పేరుతో మరో ఉద్యమం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉద్యమానికి సంబంధించిన పేజీకి ఇప్పటికే 57 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని విమర్శిస్తూ, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను వివరిస్తూ 120కి పైగా పోస్టులు అందులో ఉన్నాయి.
తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, ఈ పేజీని ఎవరు నిర్వహిస్తున్నారు, దాని వెనుక ఎవరున్నారు అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడికాలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ఆర్మీ అధికారిక పేజీని మాత్రమే ఫాలో అవుతుండటం విశేషం.
ఆకర్షితులవుతున్న యువత
రిజర్వేషన్ హఠావో ఆందోళన్ ప్రధానంగా దేశ యువతను ఆకర్షిస్తున్నది. రిజర్వేషన్ల పట్ల యువతలో వేళ్లూనుకుపోయిన అసంతృప్తిని ప్రతిబింబిస్తున్న ఈ ఉద్యమం రిజర్వేషన్ విధానం గురించి కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లను పెంచాలన్న ప్రతిపాదనలు వస్తుండటం, ముఖ్యంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన కోటా అమలు చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ ఉద్యమం తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఉద్యమం ప్రధానంగా ప్రస్తుత కుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది. రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని, విద్య, ఉద్యోగాల్లో ప్రతిభకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేజీలో ప్రచారం జరుగుతోంది. సమాన అవకాశాలే నిజమైన సామాజిక న్యాయానికి మార్గమని నిర్వాహకులు తమ పోస్టుల ద్వారా వాదిస్తున్నారు.
కుల వివక్ష నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
కుల వివక్షకు అడ్డుకట్ట వేయడంపై కూడా ఈ ఉద్యమం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వాలు కుల వివక్షను రూపుమాపాలని అంటాయని, కానీ ఆచరణలో మాత్రం ఆ లక్ష్యం ప్రతిబింబించదని వీరి వాదన. కుల వివక్షను రూపుమాపాలంటే ముందుగా ప్రజలను కులం ఆధారంగా గుర్తించడం, కులాన్ని నిరూపించుకునే ధ్రుపత్రాలను ప్రజల నుంచి కోరడం లాంటి పనులను ప్రభుత్వం ఆపాలని ఈ ఉద్యమ పేజీ సూచించింది.
చట్టాలు, ప్రభుత్వ నియమనిబంధనల్లో ఎక్కడా కుల ప్రస్తావన లేకుండా సరికొత్త విధివిధానాలు, చట్టాలను రూపొందించాలని పేర్కొంది. అప్పుడే కుల వివక్షను రూపుమాపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నది వాదన. అందుకు అనుగుణంగానే వారి లోగోపై ‘సమానత్వం, మెరిట్, న్యాయం’ అనే నినాదం కనిపిస్తున్నది.
మరోవైపు, కుల ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఆదర్శంగా ప్రస్తావించడం చర్చకు దారితీసింది. అంబేద్కర్ ఇచ్చిన ‘చదువు.. ఉద్యమించు.. సంఘటితమవ్వు’ అనే నినాదాన్ని కూడా ఈ ఉద్యమం విస్తతంగా ప్రచారం చేస్తోంది.
ప్రజా ఉద్యమంగా మారుతుందా?
సోషల్ మీడియా వేదికగా వేగంగా విస్తరిస్తున్న ఈ ఉద్యమం కేవలం ఆన్‌లైన్‌కే పరిమితమవుతుందా? లేక భవిష్యత్తులో ప్రత్యక్ష ప్రజా ఉద్యమంగా మారుతుందా? దేశ రాజకీయ, సామాజిక చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రిజర్వేషన్ల వంటి రాజ్యాంగ, సామాజిక న్యాయానికి సంబంధించిన సున్నిత అంశాలపై ఇలాంటి ప్రచారాలు దేశవ్యాప్తంగా కొత్త చర్చలకు దారితీసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






