10 July, 2026 | 5:13 AM

దద్దరల్లిన పశ్చిమాసియా

10-07-2026 12:00 AM
  1. ఇరాన్‌లో 90 లక్ష్యాలను ఢీకొట్టాం: వాషింగ్టన్
  2. చాబహార్ పోర్టుపై దాడి.. కంట్రోల్ టవర్ ధ్వంసం
  3. 14 మంది మృతి.. మరో 78 మందికి గాయాలు
  4. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
  5. బహ్రెయిన్, కువైట్, ఖతర్‌లో బాంబుల వర్షం
  6. నౌకాదళం ఫిఫ్త ఫ్లీట్ హెడ్‌క్వాటర్స్‌లో మంటలు
  7. నౌకలను టార్గెట్ చేస్తే.. 20 రెట్లు పత్రిదాడి చేస్తాం
  8. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

టెహ్రాన్, దుబాయ్, కువైట్, జూలై 9: అమెరికా, ఇరాన్ తాజా ప్రతీకార దాడులతో పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లుతోంది. ఇరాన్‌పై విరుచు కుపడుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లో దాడులు చేసింది. టెహ్రాన్‌లో దాదాపు 90 లక్ష్యాలను ఢీకొట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల్లో భారత్‌కు అత్యంక కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసం అయ్యాయి.

గురువారం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్‌లో మంటలు చెలరేగిన వీడియోలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. కువైట్‌లోని స్థావరాలపైనా దాడులు చేసినట్లు తెలిపింది. తమ దేశం వైపు వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నామని కువైట్ పేర్కొంది. ఖతర్‌లోనూ దాడులు జరిగాయి.

రెండు రోజుల అమెరికా దాడుల్లో 14 మంది మృతి చెందారని, 78 మందికి గాయాలు అయ్యాయని ఇరాన్ తెలిపింది. మరోపక్క నౌకలను టార్గెట్ చేస్తే.. 20 రెట్లు పత్రిదాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తమ సైన్యం తాజా దాడు లతో టెహ్రాన్ బెంబేలెత్తిపోయి, డీల్ కోసం అమెకాను బతిమాలుతోందని పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌పై కొత్త వైమానిక దాడులు ప్రారంభించగా, దానికి ప్రతిస్పందనగా టెహ్రాన్ గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయానికి నిలయమైన బహ్రెయిన్‌లో కనీసం మూడుసార్లు సైరన్లు మోగగా, కువైట్, ఖతర్, జోర్డాన్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. అమెరికా కూడా ఇరాన్‌లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది. ఇరాన్‌లో రెండు రోజుల పాటు జరిగిన అమెరికా దాడుల్లో 14 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోపక్క కువైట్‌లో, మూడు బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణి, 10 డ్రోన్లను కూల్చివేశామని బహ్రెయిన్ చెప్పింది.

 ఇరాన్‌లో 90 లక్ష్యాలపై దాడులు

ఇరాన్ వ్యాప్తంగా సుమారు 90 లక్ష్యాలను ఛేదించినట్లు అమెరికా సైనిక కేంద్ర కమాండ్ తెలిపింది. విమానాశ్రయ రన్‌వే, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై జరిగిన దాడులకు సంబంధించిన ఫుటేజీని కూడా విడుదల చేసింది. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషెహర్‌తో పాటు దక్షిణ ఓడరేవు నగరాలతో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అమెరికా ఇరాన్ వంతెనలను కూడా లక్ష్యంగా చేసుకుంది. గోలెస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక రైల్వే వంతెన, మషద్ నగరానికి వెళ్లే మార్గంలోని రెండు బ్రిడ్జిలను అమెరికా దాడి చేసిందని ఐఆర్‌జీఎఫ్ తెలిపింది. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి జరిగింది. 

ఇరాన్‌లోని చాబహార్ పోర్టు ధ్వంసం

భారత్‌కు అత్యంత కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దళాలు భారీ దాడులకు దిగాయి. దీంతో పోర్టు సిటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా గురువారం వెల్లడించింది. ఇక్కడి వ్యూహాత్మక మౌలిక వసతులే లక్ష్యంగా అమెరికా దాడి చేసింది. దీంతో పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ అనంతరం తొలిసారి ఈ పోర్టుపై అమెరికా దాడికి దిగింది. చాబహార్ పోర్టు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు దగ్గరగా ఉంది. 

నౌకలను టార్గెట్ చేస్తే అంతుచూస్తాం: ట్రంప్ 

హోర్ముజ్ వెళ్తున్న నౌకలను ఇరాన్ టార్గెట్ చేయడంతో తాజా దాడులు మొదలయ్యాయి. నౌకలపై మళ్లీ దాడులు జరిగితే పరిస్థితి ‘మరింత దారుణంగా’ మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. జలసంధిలో నౌకలపై దాడులను ఏ మాత్రం సహించబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ చేసే ఒక్కో దానికి 20 రెట్లు తీవ్రమైన దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే చేసిన దాడులతో ఇరాన్ డీల్ కోసం ప్రాధేయపడుతోందని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు తుర్కియే నుంచి వస్తూ న ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే.. యుద్ధానికి శాశ్వత ముగింపు కోరుతూ జరుగుతున్న చర్చలలో కీలక మధ్యవర్తి అయిన పార్లమెంట్ స్పీకర్ మొహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ధిక్కార వైఖరిని ప్రదర్శించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. బెదిరింపులు వాగ్దానాలను ఉల్లంఘించడం ఇకపై ఉచితం కాదని అమెరికా ఇంకా నేర్చుకోలేదన్నారు. తాను స్పష్టంగా చెబుతున్నానని, ‘మీరు దాడి చేస్తే, మీరే దెబ్బ తింటారు’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘శక్తికి సంకేతం కాదు, ఇరాన్ పట్ల అమెరికా విధానం విఫలమైందని అంగీకరించడమే’ అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది తెలిపారు.