ప్రజాబలంతో గెలుస్తాం
- తెలంగాణలో విజయం సాధించబోతున్నాం
- ‘సర్’పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం
- రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు
- జెన్-జీలో మోదీకి ఆదరణ ఉంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ లో బీజేపీకి ప్రజల మద్దతు ఉందని, ప్రజాబలంతోనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
‘సర్’తో బీజేపీకే లాభం జరుగుతుందని దుష్ప్ర చారం చేస్తున్నాయని.. కేరళంలో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసమే సర్‌పై ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తున్నాయన్నా రు. బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను, బూత్‌స్థాయి నెట్‌వర్క్‌ను గణనీయంగా కోల్పోతుందని, ఈ భయంతోనూ సర్‌ను వ్యతిరేకిస్తుందన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమా న్ని పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని, ఇదేదో ఓట్లను తొలగించే కార్యక్రమం కాదని, కేంద్రానికి సంబంధమే లేదన్నారు. ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. బంగ్లాదేశ్ లేదా రోహింగ్యాల చొరబాటుదారుల విషయంలో ఎక్కడైనా అనుమానాస్పద నమోదు కనిపించినట్లయితే వెంట నే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
దేశంలో 10 సార్లు ‘సర్’ జరిగింది
దేశంలో ఇప్పటికే 10 సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరిగిందని రాంచందర్‌రావు తెలిపారు. అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సర్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓట్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులకు సర్ ప్రక్రియలో సీరియస్‌గా పాల్గొనాలని సూచించడం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే అసలైన ఓటర్లు మాత్రమే జాబితాలో ఉండాలని అన్నారు. ఈరోజు సర్ ప్రక్రియలో పనిచేస్తున్న అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవారేనన్నారు.
ఎవరికీ వ్యతరేకం కాదు
సర్.. ఏ సమాజానికి, ఏ నిజమైన భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదని.. ఇది కేవలం డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్లు, అలాగే అక్రమ నమోదు వంటి అంశాలను గుర్తించి తొలగించడానికి మాత్రమే ఉద్దేశించబడిందన్నారు. ఇది ఏ మతం, కులం, ప్రాంతానికి వ్యతిరేకమైన ప్రక్రియ కాదన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైనా సరే, వారు భారతీయ పౌరులైతే ఓటరుగా నమోదు చేసుకునే పూర్తి హక్కు ఉందన్నారు. అయితే ఒక వ్యక్తి ఒకే చోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకోవడం చట్టరీత్యా తప్పు, శిక్షార్హం అని వెల్లడించారు. ప్రజలందరూ అపోహలకు లోనుకాకుండా, ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జెన్-జీలో మోదీకి ఆదరణ
జెన్--జీలో ప్రధాని నరేంద్రమోదీకి విశేష ఆదరణ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. సాంకేతికత, డిజిటలైజేషన్, స్టార్టప్ వ్యవస్థలో మోదీ తీసుకువచ్చిన మార్పుల వల్ల యువత మోదీకి అనుకూలంగా మారుతోందన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐటీ నిపుణులు రవి బందతో పాటు పలువురు ఐటీ ఉద్యోగులు రాచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతోందని, కార్పొరేషన్ ఎన్నికల్లో 90 శాతం అవకాశాలు యువతకే కల్పిస్తామని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే యువత, మేధావులు, మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేలా దృష్టి సారించామన్నారు.
ప్రధాని మోదీ తీసుకున్న తీసుకువస్తున్న ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని, దీంతో యువత బీజేపీ వైపు వస్తుందని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేసిందో ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.






