26 June, 2026 | 2:29 AM

ఓటర్ జాబితాలో సక్రమంగా వివరాలు నమోదు చేయాలి

26-06-2026 01:38 AM

ఆర్డీవో

దామరచర్ల, జూన్ 25 : అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి అన్నా. మండలంలోని దామరచర్ల, తాళ్ళ వీరప్పగూడెం గ్రామాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్వోలు పంపిణీ చేస్తున్న ఎన్యుమరేటర్ ఫారాల ప్రక్రియను గురువారం పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారన్నారు. ఓటర్లు తమ కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారం నమోదు చేసి ఫారాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.

1987కు ముందు ఓటరుగా నమోదైన వారు స్వీయ గుర్తింపు పత్రం సమర్పించాలని, 1987 నుంచి 2004 మధ్య నమోదైన వారు స్వీయ గుర్తింపు పత్రంతో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఏదైనా ఆధార పత్రాన్ని జత చేయాలని, 2004 తర్వాత నమోదైన వారు స్వీయ గుర్తింపు పత్రంతో పాటు తల్లి, తండ్రి ఇద్దరికీ సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని కోరారు. అనంతరం తాళ్ల వీరప్పగూడెం గ్రామంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.