జల వివాదాలను పరిష్కరించుకుందాం
- మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పరిష్కారం చూపాలి
- తెలంగాణకు నీటి వాటాపై ఆయనతో చర్చించాం
- తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ.. కరువు జిల్లాలకు పరిష్కారం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభం
- హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): నీటి పంపకాలపై తమకు పంచాయతీలు వద్దని, పరిష్కారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యను సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు.
ఇందుకోసం తుంగభద్ర సమావేశంలో మొదటి అడుగు పడిందని భావిస్తున్నానని చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించకపోవడంతోనే పాలమూరు వాసులు వలసలు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. రాయలసీమ, తెలంగాణలోని లక్షలాదిమంది రైతుల సమస్యకు తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పరిష్కారమని వ్యాఖ్యానించారు. గురువారం కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లో తుంగ భద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతంర కొప్పల్ జిల్లా మునీరాబాద్ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని పేర్కొన్నారు. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదని, మూడు తరాల సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని తెలిపారు. నీటి సమస్యలు పరిష్కరించుకోకపోవడంతో నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు.
మూడు రాష్ట్రాల మధ్య నీటి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అన్నారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని, కర్నూలు, అనంతపురం రైతుల సమస్యలు తనకు తెలుసు అని తెలిపారు. గద్వాల, ఆలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో ఆర్డీఎస్‌కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో 5 నుంచి 6 టీఎంసీలే మన రైతాంగం వాడుకుంటోందని, తుంగభద్ర నుంచి దాదాపు 10 టీఎంసీల నీరు తమకు రావడం లేదని చెప్పారు.
తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టి తీసుకెళ్లామన్నారు. ఆర్డీఎస్ కింద రైతులకు న్యాయం జరగాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని తెలిపారు. తమకు పంచాయితీలు వద్దని పరిష్కారం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, తెలంగాణలోని లక్షలాదిమంది రైతుల సమస్యకు తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పరిష్కారామని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై, తుంగభద్రలో పూడికతీతకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యను సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. ఆయన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం తుంగభద్ర సమావేశంలో మొదటి అడుగు పడిందని భావిస్తున్నానని చెప్పారు.
మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. తుంగభద్ర నది ఒడ్డున జరిగిన చర్చలు అంతరాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని అభిప్రాయపడ్డారు. మైసూరు రాజులే రైతుల కోసం యుద్ధాన్ని వీడి పరిష్కారం కోసం ముందుకొచ్చారని, రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు.
నదుల అనుసంధానంతోనే సమృద్ధిగా జలాలు: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్
ప్రస్తుత డ్యాములు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఒక గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. నర్మద, సరోవర్ జలాలు మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, ఈ ప్రక్రియతో గుజరాత్‌లో నదీ జలాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. రూ. లక్ష కోట్లతో రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో 3 నదులు అనుసంధానం చేపట్టామని పేర్కొన్నారు.
నదుల అనుసంధానం జరగాలి: ఏపీ సీఎం
రాయలసీమలోని పలు ప్రాంతాలకు సాగునీరు.. మరికొన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు తుంగభద్ర అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో నదుల అనుసంధానం తన కలల ప్రాజెక్టు అని ఉద్ఘాటించారు. గంగా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరగాలని, నదుల అనుసంధానం జరిగితే భారతదేశం అన్ స్టాపబుల్‌గా దూసుకెళ్తుందన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతోందని చెప్పారు. 6 నెలల్లో తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్ల పునరుద్ధరించామని వివరించారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలని 1983లో నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నీటి సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇవాళ ముగ్గురు సీఎంలు కలవడం చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు.
చరిత్రాత్మక తీర్మానం చేశాం: డీకే శివకుమార్
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో చరిత్రాత్మక తీర్మానం చేశామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తాము చరిత్ర చదవమని, చరిత్ర లిఖించము.. కానీ చరిత్ర సృష్టిస్తామన్నారు. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. మూడు రాష్ట్రాల రైతుల కోసం తీసుకున్న నిర్ణయం ఓ చరిత్ర అన్నారు. దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు. జత కూడటం ఆరంభమని, కలిసి నిర్ణయం తీసుకోవడం ప్రగతి అని, కలిసి పనిచేస్తే విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కృష్ణా, కావేరి, గోదావరి విషయంలోనూ మనందరం ఏకమై రైతులను బతికించాలని చెప్పారు.






