పరాక్రమానికి ప్రతీక పాపన్న గౌడ్
బీసీ సంక్షేమ కమిషన్ సభ్యులు బాల లక్ష్మి గౌడ్
తుంగతుర్తి, జూన్ 25 : మొఘల్ పాలకుల దౌర్జన్యాలకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పరాక్రమానికి ప్రతీక అని బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కోతి కిషోర్, జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు రామారావు పేర్కొన్నారు.
గురువారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గౌడ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షులు విగ్రహ దాత తాళ్లపల్లి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహోన్నత యోధుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో పోరాట ఫలితమే నేడు నాకు బీసీ సంక్షేమ కమిషన్ సభ్యులుగా రావడం జరిగిందని, గౌడుల సమస్యలను ప్రభుత్వం తరఫున తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంకు బండిపై పెట్టించుటకు, జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టుటకు ముఖ్యమంత్రితో మాట్లాడుతానని పేర్కొన్నారు. పాపన్న జీవిత గాథ నేటి యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.విగ్రహ ఆవిష్కరణ అనంతరం పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు కోతి యాకన్న, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గోడ సంఘం నాయకులు అంజిబాబు, రవీందర్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మాజీ జెడ్పిటిసి పాలకుర్తి రాజయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కోతి ఆలియా, కార్యక్రమం బహుజన ఉద్యమ నాయకులు మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, పాలకుర్తి శ్రీకాంత్,కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య, ప్రధాన కార్యదర్శి చిర్ర నరేష్, విగ్రహ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, వివిధ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.






