26 June, 2026 | 1:46 AM

ఏం సాధించావని సువర్ణ అధ్యాయం?

26-06-2026 12:26 AM
  1. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా సాధించావా?
  2. తుంగభద్ర గేట్లు మారిస్తే సంబురాలా!
  3. ఆర్డీఎస్‌పై తెలంగాణకు అన్యాయం
  4. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం కంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా విషయంలో ఏం సాధించారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల వాటా, ఆర్డీఎస్ సమస్యల పరిష్కారం, పొరుగు రాష్ట్రాల నుంచి స్పష్టమైన హామీలు వంటి కీలక అంశాల్లో ఎలాంటి పురోగతి లేకుండానే సమావేశాన్ని ‘సువర్ణ అధ్యాయం‘గా చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కంటే ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) నీటి వాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఏవైనా స్పష్టమైన హామీలు సాధించారా అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేయడం, ఆనకట్ట మరమ్మతులు చేపట్టడం, కర్ణాటక పరిధిలోని కాలువకు తక్షణ మరమ్మతులు చేసి క్రమం తప్పకుండా నిర్వహించేలా హామీలు తీసుకున్నారా అని నిలదీశారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ప్రతిసారీ తగ్గిపోతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుందో ముఖ్యమంత్రి వివరించాలని డిమాండ్ చేశారు.

‘సిస్టమ్ లాసెస్‘ అనే వాదనను రేవంత్‌రెడ్డి ఎందుకు అంగీకరించారో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డులో ఈ అంశానికి గుర్తింపు లేదని, దీన్ని సాకుగా చూపి తెలంగాణకు రావాల్సిన వాటాను తగ్గించకూడదన్నారు. అలాగే కేసీ కెనాల్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తోందని, కర్ణాటకతో కలిసి మరికొంత నీటిని ఇతర కాలువలకు మళ్లిస్తోందని ఆరోపించారు.

దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించలేదని విమర్శించారు. తుంగభద్ర- ఆర్డీఎస్ మధ్య కర్ణాటక ప్రతిపాదిస్తున్న నవేలి రిజర్వాయర్, ఆర్డీఎస్ -సుంకేసుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు.