26 June, 2026 | 1:45 AM

పౌరసత్వానికి పాస్‌పోర్టు ప్రూఫ్ కాదు!

26-06-2026 12:47 AM
  1. అది విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణ పత్రం మాత్రమే
  2. విదేశాంగ శాఖ స్పష్టీకరణ
  3. పౌరసత్వ ధ్రువీకరణ ఎలాగనే ప్రశ్నలు
  4. కచ్చితమైన పత్రమేదీ లేదంటున్న నిపుణులు

న్యూఢిల్లీ, జూన్ 25: పాస్‌పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వానికి కచ్చితమైన రుజువు కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఈనెల 24న నిర్వహించిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయగా, ప్రతిపక్ష పార్టీలు  కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.  పాస్‌పోర్ట్‌ను భారత పౌరులకు మాత్రమే జారీ చేసినప్పటికీ, అది చట్టపరంగా పౌరసత్వాన్ని నిర్ధారించే తుది పత్రం కాదు.

పాస్‌పోర్ట్ జారీకి ముందు పోలీసు ధ్రువీకరణ, పలు పత్రాల పరిశీలన జరిగినప్పటికీ, పౌరసత్వాన్ని 1955 పౌరసత్వ చట్టం ప్రకారం మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడమే పాస్‌పోర్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. నిజానికి ఆధార్ గానీ, ఓటర్ ఐడీ కార్డుగానీ కేవలం గుర్తింపు పత్రాలే తప్ప..

అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు గతంలోనే స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు పాస్‌పోర్టు అంశంలోనూ అదే వర్తిస్తుందని పేర్కొంది. భారత పౌరులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్‌ను జారీ చేసే వెసులుబాటు చట్టంలో ఉందని తెలిపింది. అది ఉందంటే పౌరసత్వాన్ని నిర్ధారించినట్టు కాదని 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును విదేశాంగ శాఖ గుర్తుచేసింది. 

ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం    

విదేశాంగ శాఖ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ స్పందిస్తూ, పాస్‌పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాకపోతే సాధారణ ప్రజలు తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలని ప్రశ్నించారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వీయా మాట్లాడుతూ, విదేశాంగ శాఖ కేవలం చట్టపరమైన వాస్తవాలను మాత్రమే పునరుద్ఘాటించిందన్నారు.

పౌరసత్వాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రం, కుటుంబ పత్రాలు, ఓటరు జాబితాలు, విద్యా ధవీకరణ పత్రాలు, భూమి రికార్డులు, పాస్‌పోర్ట్ తదితర పత్రాలను కలిపి పరిశీలిస్తారని వివరించారు. మరోవైపు, చట్టపరంగా కూడా పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది ఆధారం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2013లో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

పౌరసత్వం అనేది ఒక్క పత్రంపై కాకుండా, పలు ఆధారాల సమాహారంపై ఆధారపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశం సోషల్‌మీడియా నుంచి రాజకీయ వేదికల వరకు చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్‌పై విదేశాంగ శాఖ చేసిన ఈ వివరణ ప్రజల్లో గందరగోళాన్ని పెంచిం దా? లేక చట్టపరమైన వాస్తవాలను మాత్రమే వెల్లడించిందా? అన్న అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

చర్చ ఎటు దారితీస్తోంది?

పౌరసత్వానికి పాస్‌పోర్టు రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్‌లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్‌పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్‌లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యలతో భారత పౌరసత్వానికి ఏది ప్రామణికమన్న చర్చ జోరుగా నడుస్తోంది.