26 June, 2026 | 2:27 AM

వణికిన వెనిజులా

26-06-2026 01:13 AM

వెనిజులాను వణికించిన రెండు భారీ భూకంపాలు

  1. పేకమేడల్లా కూలిన భవనాలు, హోటళ్లు, ఇళ్లు 
  2. శ్మశానంగా మారిన లా గువైరా నగరం

కారకాస్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత

188 మంది మృతి 

* దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులాను రెండు భయంకరమైన భూకంపాలు కబళించాయి. నిమిషం వ్యవధిలోనే రాజధాని కారకాస్, దాని పరిసర ప్రాంతాలు చిగురుటాకుల వణికిపోయాయి. భీకర ప్రకంపనల ధాటికి కారకాస్‌లో బహుళ అంతస్తుల భవనాలు, గృహాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుపోయారు. గురువారం అర్ధరాత్రి వరకు ౧౮౮ మంది మరణిం చారు. అయితే మృతులసంఖ్య లక్ష దాటొచ్చునని అంచనా వేస్తున్నారు.

  1. నిమిషం వ్యవధిలోనే జంట భూకంపాలు
  2.   188 మంది మృతి.. 1,500 మందికిపైగా గాయాలు 
  3. మృతుల సంఖ్య లక్ష దాటొచ్చని యూఎస్‌జీఎస్ అంచనా 
  4. పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు, హోటళ్లు, ఇళ్లు, స్తంభాలు 
  5. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, సెల్‌ఫోన్ సిగ్నల్స్ 
  6. సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత 
  7. శ్మశానంలా మారిన లా గువైరా నగరం 
  8. మొదటిసారి 7.2 తీవ్రత.. 22 కి.మీ లోతులో..భూకంపం 
  9. రెండోసారి 7.5 తీవ్రత.. 10 కి.మీ లోతులో.. 
  10. అత్యవసర పరిస్థితి ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ 
  11. 12 దేశాలకు పైగా సహాయక చర్యలు 
  12. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో కూడా భూకంపాలు

కారకాస్ (వెనిజులా), జూన్ 25: వెనిజులాను రెండు శక్తివంతమైన భారీ భూకంపాలు బుధవారం సాయంత్రం కుదిపేశాయి. తొలుత 7.2 తీవ్రతతో, ఆ వెంటనే నిమిషం వ్యవధిలోనే మరోసారి 7.5 తీవ్రతతో భూమి భారీగా కంపించింది. భారీ ప్రకంపనలకు 188 మందికిపైగా మరణించారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భీకర ప్రకంపనల ధాటికి కరాకస్‌లో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు పేకమేడల్లా కుప్ప కూలిపోయాయి.

ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి, బహిరంగ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు. విద్యుత్, సమాచార సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం కుటుంబీకులు, బంధువుల అర్థనాదాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు చేసింది. చాలా మంది శిథిలాల మధ్య తప్పిపోయిన వారి కోసం వెతికారు. దేశంలోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు కూలింది.

దీంతో విమానా సర్వీసులను రద్దుచేసి, ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఈ జంట భూకంపాలు రవాణా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపాయి. భూకంపాల ధాటికి లా గువైరా నగరం శ్మశానంగా మారిం ది. ఈ నగరాన్ని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ‘విపత్తు ప్రాంతం’గా ప్రకటించారు. అదే సమయంలో వెనిజులా రాజధాని కారకాస్‌కు సుమారు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ అమెజాన్ వంటి సుదూర ప్రాంతాల్లోని భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పరిస్థితిని అత్యవసరంగా పరిగణించిన వెనిజులా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ, వివిధ దేశాల సహాయ బృందాలను రంగంలోకి దింపింది.

అయితే ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భూగర్భ సర్వే సంస్థ అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో కూడా భూకంపాలు తక్కువ తీవ్రతతో సంభవించాయి.

 వెనిజులా అనేక ఫాల్ట్ లైన్లకు సమీపంలో ఉన్నప్పటికీ, దక్షిణ అమెరికా, కరేబియన్ ప్లేట్ల మధ్య దాని భౌగోళిక స్థానం కారణంగా, లాటిన్ అమెరికా లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ బలమైన భూకంపాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. --భూకంపాల సమయంలో, కారకాస్‌లో ఊగిపోతున్న భవనాల నుంచి ప్రజలు పరుగులు తీశారు. తిరిగి చూసేసరికి, కూలిపోయిన శిథిలాల మధ్య అనేక మంది నలిగిపోయారు. వేలాది మంది చిక్కుకుపోయారు.

చాలా మంది గంటల తరబడి వీధుల్లోనే ఉండిపోయారు. మరికొందరు పార్క్ చేసిన కార్లలో, సబ్వే స్టేషన్లలో, ఇతర బహిరంగ ప్రదేశాలలో రాత్రంతా గడిపారు. సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. కారాకస్‌లో సబ్వే సేవలను నిలిపివేశారు. సహజ వాయువు సరఫరాను బంద్‌చేశారు.

కొన్ని రోజుల పాటు తరగతులను కూడా రద్దు చేస్తారని, కొన్ని పాఠశాల భవనాలను ఆశ్రయ కేంద్రాలుగా, విరాళాల కేంద్రాలుగా ఉపయోగిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం, వేలాది మంది ప్రజలు తమ వారి కోసం సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తప్పిపోయిన బంధువుల చిత్రాలను, వారు చివరిగా కనిపించిన ప్రదేశాలను పోస్ట్ చేశారు.

రెండుసార్లు భారీ భూకంపాలు

వెనిజులాను రెండుసార్లు భారీ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం రెక్టార్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో, కారకాస్‌కు పశ్చిమాన సుమారు 170 కిలోమీటర్ల దూరంలో.. కరేబియన్ తీరంలోని మోరోన్‌కు పశ్చిమంగా సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలి పింది. ఇది 22 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కేవలం ఒక నిమిషం తర్వాత, 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. ఇది 10 కిలోమీటర్ల లోతులో, మోరోన్‌కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో కేంద్ర బిందువుతో సంభవించిందని తెలిపింది.

ఒకే రోజు మూడు ఖండాల్లో..

భూకంపాల ప్రభావంతో బ్రెజిల్‌లోని అమెజాన్‌లో ఉన్న మనాస్, బెలెం, మకాపాలోని భవనాలను ఖాళీచేయించారు. కొలం బియాలోని కరేబియన్, ఈశాన్య ప్రాంతాలలో కూడా ఈ భూకంపాలు సంభవిం చాయి. అమెరికాలోని కాలిపోర్నియాలో 5.6 తీవ్రతతో, జపాన్‌లో 7.2 తీవ్రతతో వచ్చాయి. జపాన్‌లో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరగలేదని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

ప్రపంచంలో ఒకే రోజు మూడు ఖండాల్లో ఇలా వేర్వేరుచోట్ల భూకంపాలు రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వెనిజులాలో అసాధారణమైనప్పటికీ, పసిఫిక్ తీ రం వెంబడి, ముఖ్యంగా మెక్సికో, చిలీలలో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. ఈ రెండు దేశాలు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలువబడే భూకంపపరంగా చురుకైన టెక్టోనిక్ బెల్ట్ వెంబడి ఉన్నాయి. ప్రపంచంలోని 90 శాతం భూకంపాలకు ఈ ప్రాంతమే కారణమని యూఎస్‌జీఎస్ చెబుతోంది.

సహాయక చర్యల్లో అనేక దేశాలు

ఈ విపత్తు వేళ వెనిజులాకు సాయం చేయడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి సహాయ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. జర్మనీ, స్పెయిన్, అమెరికా, అర్జెంటీనా, చిలీ, పనామా, ఉరుగ్వే, ఖతర్, మెక్సికో, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్, బొలీవియా సహా పలుదేశాల ప్రభుత్వాలు సహాయం అందించడానికి ముందుకొచ్చాయి. సహాయక సిబ్బందిని పంపాయని తాత్కాలిక ప్రధాని రోడ్రిగ్జ్ గురువారం తెలిపారు. ఆయా దేశాలు వెనిజులాకు గాలింపు, సహాయక బృందాలు, వైద్య వనరులు, మానవతా సహాయాన్ని అందిచనున్నట్లు పేర్కొన్నారు. 

శ్మశానంగా లా గువైరా నగరం

తీర నగరమైన లా గువైరా ఇప్పుడు శ్మశానంగా మారింది. అక్కడ ఎటుచూసినా ధ్వంసమైన భవనాలే కన్పిస్తున్నాయి. ఈ నగరంలోని అతిపెద్ధ, ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ శిథిలాల దిబ్బగా మారింది. లా గువైరాలోని మకుటో ప్రాంతంలో ఉండే 10 అంతస్తుల హోటల్ ఎడ్వర్డ్ పర్యాటకులకు చాలా ప్రసిద్ధి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండే ఈ హోటల్.. బీచ్‌వ్యూతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది.

ఇక్కడ పార్టీలు, సమావేశాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంపం ధాటికి ఈ భవనం నామరూపాల్లేకుండా ధ్వంసమైంది. అయితే ఈ హోటల్ లో ఎంతమంది ఉన్నారో.. వారి పరిస్థితి ఏం టో తెలిలేదు. వెనుజులా బేస్‌బాస్ స్టార్ ఆటగాళ్లకు చెందిన కుటుంబ సభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

అత్యవసర విపత్తు జోన్‌గా లాగువైరా

క్షణాల వ్యవధిలోనే సంభవించిన భారీ భూకంపాలతో వెనిజులా రాజధాని కరాకస్‌తోపాటు అనేక నగరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇందులో అత్యధికంగా ప్రభావితమైంది మాత్రంలా గువైరా నగరమేనని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీరోడ్రిగ్జ్ తెలిపారు. దీన్ని దీన్ని అత్యవసర విపత్తుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 30 సార్లు భూ కంపాలు సంభవించాయి. బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపాల వల్ల దెబ్బతిన్న ఆసుపత్రులు, ఇళ్ల కోసం ప్రభుత్వం 200 మిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు.

క్షణాల ముందే గూగుల్ అలర్ట్

వెనిజులాలో జంట భూకంపాలు సంభవించే కొన్ని క్షణాల ముందే గూగుల్ పలు స్మార్ట్ ఫోన్లకు అలర్ట్ పంపింనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి స్క్రీన్‌షాట్‌లను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ అలర్ట్‌లను బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కాసేపటికే భూకం పాలు సంభవించాయి. అధునాతన స్మార్ట్ ఫోన్లలో యాక్సిలరో మీటర్ పరికరం ఉంది. ఇది సాధారణంగా ఒక సెన్సార్. దీని వల్ల స్క్రీన్ ఆటోమేటిక్‌తోపాటు మరో ఉపయో గం ఉంది. ఈ సెన్సార్ కంపనాలను కూడా గుర్తిస్తుంది.

వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్‌కు సిగ్నల్ పంపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు రెండు రకాల అలర్ట్‌లు ఇస్తుంటాయి. ఒకటి బీ అవేర్ అలర్ట్. ఇది తక్కువ తీవ్రత ప్రకంపనాలు ఉన్నప్పుడు ఇచ్చే సిగ్నల్. రెండోది టేక్ యాక్షన్ అలర్ట్. ఇది మధ్యస్థ, తీవ్ర స్థాయి భూకంపాల సమయంలో అలర్ట్ చేస్తుంటుంది. భారత దేశంలోనూ 2023 నుంచి ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 5 అంతకంటే ఆధునిక వెర్షన్లలో ఈ ఫీచర్ ఉంది. అలర్ట్‌లు రావాలంటే తప్పనిసరిగా ఫోన్‌లో డేటా లేదా వైఫై ఆన్‌చేసి ఉండాలి.

వెనిజులాకు వివిధ దేశాలు సంఘీభావం

వెనిజులాలోని భూకంపాలపై ప్రపంచ నాయకులు గురువారం స్పందిస్తూ సంఘీభావం తెలిపారు. అండగా ఉంటామని, సహాయ సిబ్బందిని పంపిస్తున్నామని పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్, కొలంబియాకు కాబోయే అధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రిల్లా వెనిజులా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1641 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు భూకంపాలు

వెనిజులా తరచూ భూకంపాల బారిన పడుతున్న దేశాల్లో ఒకటి. గత నాలుగు శతాబ్దాలుగా అక్కడ సంభవించిన భూకంపాలు పదేపదే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. 1641 నుంచి 2026 వరకు 12 సార్లు భూకంపాలు సంభవించాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం పట్టణాలే శిథిలాలుగా మారగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం సంభవించిన తాజా జంట భూకంపాలతో మరోసారి వెనిజులా ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.

గతంలో ఆ దేశాన్ని వణికించిన ప్రధాన భూకంపాల వివరాలు ఇలా ఉన్నాయి. 2026 - కారాబోబో- కారకాస్ జంట భూకంపాలు వచ్చాయి. 2026 జూన్ 24న కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతలతో రెండు సార్లు సంభవించాయి. కేంద్రం కారాబోబో రాష్ట్రంలోని మొరాన్ సమీపంలో ఉన్నప్పటికీ, ప్రభావం రాజధాని కారకాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కనిపించింది. 2018 - సుక్రే తీర ప్రాంత భూకంపం వచ్చింది. 2018 ఆగస్టు 21న సుక్రే రాష్ట్ర తీర ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం నమోదైంది.

ప్రకంపనలు ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానా, కొలంబియా వరకు వచ్చాయి. 1997 కారియాకో భూకంపం సంభవించింది. 1997 జూలై 9న సుక్రే రాష్ట్రంలోని కారియాకో ప్రాంతంలో 6.9 తీవ్రత నమోదైంది. 81 మంది మరణించారు. 683 మంది గాయపడ్డారు. 1967లో -కారకాస్ భూకంపం వచ్చింది. 1967 జూలై 29న కారకాస్ నగరాన్ని 6.6 తీవ్రతతో కుదిపేసింది. 225 నుంచి 300 మంది వరకు మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. 1929లో- కుమానా భూకంపం సంభవించింది.

1929 జనవరి 17న కుమానా నగర సమీపంలో 6.9 తీవ్రతతో నమోదైంది. 200 మందికిపైగా మరణించారు. 1900లో- మిరాండా తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. 1900 అక్టోబర్ 29న మిరాండా రాష్ట్ర తీర ప్రాంతంలో 7.6 తీవ్రతతో సంభవించింది. దీని ప్రభావంతో చిన్నపాటి సునామీ నమోదైంది. 100 మందికిపైగా మరణించారు. 1894లో - మెరిడా భూకంపం వచ్చింది. 1894 ఏప్రిల్ 28న మెరిడా ప్రాంతంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది.

సుమారు 350 మంది మరణించారు. 1875లో- కుకుటా సరిహద్దులో భూకంపం వచ్చింది. 1875 మే 18న వెనిజులా కొలంబియా సరిహద్దులోని కుకుటా ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించింది. సుమారు 10 వేల మంది మరణించినట్లు సమాచారం. 1853లో- సుక్రే తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. 1853 జూలై 15న సుక్రే తీర ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. 1812లో- కారకాస్ భూకంపం వచ్చింది.

1812 మార్చి 26న కారకాస్, లా గువైరా, మెరిడా, బార్క్విసిమెటో ప్రాంతాల్లో 7.7 తీవ్రతతో సంభవించింది. 15 వేల నుంచి 20 వేల మంది వరకు మరణించినట్లు అంచనాలు ఉన్నాయి. 1641లో- కారకాస్ భూకంపం వచ్చింది. 1641 జూన్ 11న కారకాస్ నగరంలో 6.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. సుమారు 200 మంది మరణించారు.