26 June, 2026 | 2:28 AM

రేవంత్‌కు రియల్ కప్పం కట్టాల్సిందే!

26-06-2026 01:02 AM
  1. రాష్ట్రంలో ఇప్పుడు భూములు కొనేవారే లేరు! 
  2.   72 సార్లు ఢిల్లీకి పైసల మూటలు పట్టుకెళ్లాడు 
  3. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు 
  4. రెండున్నరేళ్లలో అన్నివర్గాలను మోసం చేశారు 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చేవెళ్ల, జూలై 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, ప్రభుత్వ నిర్ణయాలతో మందగమనం దిశగా పయనిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనలో భూములు కొనేవారే లేకుండా పోయారన్నారు. భవనాలు కట్టుకోవాలంటే సీఎంకు కప్పం చెల్లించాల్సిందేనని ఆరరోపించారు. రేవంత్‌రెడ్డి రెన్యువల్ సీఎం మాత్రమేనని, రెగ్యులర్ సీఎం కాదన్నారు. 72 సార్లు ఢిల్లీకి పైసల మూటలు పట్టుకెళ్లిన సీఎం..

రాష్ట్రంలో మాత్రం మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, రెండున్నరేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో  నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం చందన్‌వెల్లిలో పారిశ్రామిక వాడను తీసుకొచ్చి అభివృద్ధి బాట పట్టించామని చెప్పారు.

తమ హయాంలో షాబాద్, చందన్ వెల్లి, సీతారాంపూర్‌లో ఎకరం 3 కోట్లకు ఉండేదని, రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రూ.50 లక్షలు, రూ.60 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు కొనే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కళకళలాడిన రియల్ ఎస్టేట్ రంగం, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్ర మందగమనంలోకి వెళ్లిందని, భూముల విక్రయాలు జరగక, పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని, నగరంలో కొత్త బిల్డింగులు కట్టాలంటే బిల్డర్ల దగ్గర సీఎం కప్పం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అప్పులు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఆ నిధులను ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేశామని స్పష్టం చేశారు.

దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేశామని, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు అందించి ఆదుకున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం 72 సార్లు ఢిల్లీకి పైసల మూటలు పట్టుకుని తిరిగారని ఆరోపించారు. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి కేవలం రెన్యువల్ సీఎం మాత్రమే.. రెగ్యులర్ సీఎం కాదన్నారు. 2029లో మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 

రెండున్నరేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదు

సీఎం రేవంత్‌రెడ్డి రజినీకాంత్‌లాగా డైలాగులు చెబితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏకంగా కమల్‌హాసన్‌ను మించి యాక్షన్ చేస్తూ తెలంగాణ ప్రజలను నిండా ముంచుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్టం ప్రమాదంలో పడిపోయిందన్నారు. పేదల ఇండ్లు కూల్చి హిట్లర్‌లా పైసాచికానందం పొందుతున్నారని ఫైర్ అయ్యరు. మూడుసార్లు రైతుబంద్ ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఆరు నెలలు కాదు.. మూడు నెలల్లోనే మొత్తం చేస్తానని రేవంత్ డైలాగులు కొట్టాడని, 900 రోజులైనా ఏమి చేయలేదని విమర్శించారు.

ఆయన మాటల మనిషే కాదు మూటల మనిషి అని ఎద్దేవా చేశారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, వికలాంగులను, వృద్ధులను, ఇలా అన్నీ వర్గాలను మోసం చేశాడన్నారు. పార్టీ జెండాపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే, ఎంపి ప్లేటు ఫిరాయించారు. పార్టీకి మోసం చేసిన యాదయ్యను వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. ఈ నెల రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి

ఎంపీటీసీ, ఎంపీటీసీ పోటీ చేయాలని అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అర్హుల ఓట్లు తొలగించకుండా, దొంగ ఓట్లు రాకుండా చూడాలని చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న డబుల్, త్రిబుల్ ఓట్లను గుర్తించాలని చెప్పారు. రామాయణంలో రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లినట్లు తాను కూడా 14 ఏళ్ల తర్వాత మళ్లీ చేవెళ్లలో ఇన్వాల్వ్ అయినట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నిజంగా చిన్న ఇబ్బంది ఉన్నా ఇంద్రారెడ్డి కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు.