వరంగల్‌లో కల్తీ పచ్చళ్ల తయారీ
తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడి
రూ.2.25 లక్షల విలువైన 2,100కిలోల కుళ్లిన నిల్వలు స్వాధీనం.. ఒకరి అరెస్టు
హనుమకొండ, జూన్ 25 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, తయారీ ముఠాలో ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతేజార్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ ఇంటిలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ భాను ప్రకాష్, సిబ్బంది గురువారం ఆకస్మిక దాడి జరిపారు. ఈ దాడిలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి, ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
కుళ్లిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రంలో దాదాపు 2,100కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2.25 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.






