26 June, 2026 | 2:09 AM

జలమండలి కార్యాలయం ముట్టడి

26-06-2026 12:55 AM

బిందెలతో బీఆర్‌ఎస్ ఆందోళన

నీటిసమస్యపై గళమెత్తిన ప్రజలు

మేడిపల్లి, జూన్ 25 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్‌చెంగిచెర్ల ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ నాయకత్వంలో ప్రజలు, మహిళలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి చెంగిచెర్ల జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనలో భాగంగా మహిళలు బిందెలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని తాగునీటి సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ర్యాలీ అనంతరం కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో వారానికి ఒక్కసారే తాగునీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్కువ ఒత్తిడితో నీరు రావడం వల్ల అనేక కాలనీలకు సరైన నీటి సరఫరా అందడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు.