22 August, 2026 | 4:36 PM

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

22-08-2026 03:34 PM

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తాం...

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...

ఉట్నూర్, ఆగస్టు 22(విజయక్రాంతి): పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శనివారం మంత్రి ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కలు అందించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్‌ను మంత్రి  ప్రారంభించారు. ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద, గిరిజన విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, షూస్, పుస్తకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, శారీరక దారుఢ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జూంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఉన్నత స్థానాలకు ఎదగాలి: ఎమ్మెల్సీ దండే విఠల్

ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, పేద, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఇంజనీర్లు, వైద్యులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, గిరిజన స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందిస్తూ అనేక మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాలల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న డిజిటల్ బోర్డులు, సైన్స్ ల్యాబ్‌లు, ఇతర ఆధునిక సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.