22 August, 2026 | 5:01 PM

రైతుల నష్టపరిహారం కోసం కోనరావుపేటలో బీజేపీ రాస్తారోకో

22-08-2026 04:10 PM

కోనరావుపేట, ఆగస్టు 22 (విజయక్రాంతి): రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీజేపీ కోనరావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో శనివారం కోనరావుపేట మర్రి వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు .గత రెండేళ్లుగా కురిసిన అకాల వర్షాల కారణంగా మరిమడ్ల, శివంగాలపల్లి, ఎగ్లాస్ పూర్, వెంకట్రావుపేట, వట్టిమల్ల తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ నాయకులు తెలిపారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, అధికారులతో సర్వే చేయించినప్పటికీ ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపించారు. ఈ  విషయంపై తహశీల్దార్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో రాస్తారోకో చేపట్టాల్సి వచ్చిందన్నారు. రైతులకు నష్టపరిహారంతో పాటు హమాలీలు, కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పూర్తిస్థాయి పరిహారం విడుదల చేయాలని, గతంలో మరిమడ్ల గ్రామాన్ని సందర్శించి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం చెల్లించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు బైరవని సురేష్, చింతల పరిసరంలో జితేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.