22 August, 2026 | 5:44 PM

మాదాపూర్ అంజయ్యనగర్‌లో ఘోరప్రమాదం

22-08-2026 04:09 PM

-50 గజాల్లో ఏడంతస్తుల అక్రమ భవనం కూలి ఇద్దరు మృతి 

శేరిలింగంపల్లి,ఆగస్టు 22 (విజయక్రాంతి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో శనివారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది. నాలా పక్కన కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం(Building collapsed) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. శిథిలాల కింద నుంచి వారి మృతదేహాలను వెలికితీశారు. పక్కనున్న అపార్ట్‌మెంట్‌పై శిథిలాలు పడి ఇద్దరికి గాయాలయ్యాయి.భవనం కూలిన వెంటనే పెద్ద శబ్దాలు వినిపించడంతో స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు.

సమీపంలోని హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భవనం కూలిన సమయంలో లోపల ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే మాదాపూర్ పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు, గాలింపు చర్యలు చేపట్టారు. భవనం కూలడంతో పక్కనున్న అపార్ట్‌మెంట్ గోడలు ధ్వంసమై, లోపలి సామగ్రి నష్టపోయింది.

ఈ భవనం నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే స్థానికులు ఇది అక్రమ నిర్మాణమని, అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపిస్తున్నారు. నాలా పక్కన ఇంత ఎత్తైన భవనం నిర్మించడం ప్రమాదకరమని, అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.భవన యజమాని వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. అధికారులు నిర్మాణ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై విచారణ చేపట్టనున్నారు. రెస్క్యూ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.