కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 గ్రూపుల్లో 1,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ కేవలం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
మరో ప్రధాన సమస్య బెంచీల కొరత అని, విద్యార్థులందరికీ సరిపడా బెంచీలు, డెస్కులు లేక కొంతమంది విద్యార్థులు నేలపై కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే ముందుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.1,000 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు, సరిపడా బెంచీలు, డెస్కులు వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో తదుపరి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు పాషా, కార్యదర్శి అశ్విని, రవి కాంత్,నోమన్, మీనాక్షి, హిమశ్రీ,రాణి,చందు,తదితరులు పాల్గొన్నారు.






